గ్లోవ్స్ కారణంగా ఐదు పాయింట్ల కోత, వీడియో వైరల్

Posted By:
Matthew Renshaw's Joke Goes Wrong, Concedes Five Penalty Runs

హైదరాబాద్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మాథ్యూ రెన్షా మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సరదాగా చేసిన ఓ పని ఆ జట్టుకు ఐదు పరుగుల కోతపడేలా చేసింది. ఆ తర్వాత ఇలాంటి నిబంధన ఉందని తెలియదని మొత్తుకున్నా లాభం లేకుండా పోయింది. క్రీడా నియమావళి ఉల్లంఘన కింద ఫీల్డ్ అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆసీస్ దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెన్షా క్వీన్స్‌లాండ్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వెస్ట్రన్ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్ బంతిని స్వేర్‌లెగ్ దిశగా బాదాడు. బంతి కోసం పరుగెత్తే క్రమంలో కీపర్ జిమ్మీ పీర్సన్ తన చేతికి ఉన్న ఒక గ్లోవ్‌ను కీపింగ్ చేసే స్థానంలోనే పడేసి వెళ్లాడు.


ఆ సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెన్షా ఆ గ్లోవ్‌ని తన చేతికి పెట్టుకొని కీపర్ విసిరిన బంతిని గ్లోవ్‌తో అందుకున్నాడు. ఐతే నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కేవలం కీపర్ మాత్రమే గ్లోవ్స్ ధరించాలి. దీంతో రెన్షా జట్టు స్కోరు నుంచి ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తున్నట్లు అంపైర్లు మైదానంలో చెప్పేశారు.

అనంతరం రెన్షా మాట్లాడుతూ.. నా పక్కనే కీపర్ గ్లోవ్ పడేసి వెళ్లాడు. దాన్ని పెట్టుకొని బంతిని క్యాచ్ పట్టాను. ఐతే సరదా కోసం మాత్రమే ఇలా చేశానని.. నిజంగా ఇలాంటి నిబంధన ఉందని ఆ సమయంలో ఆలోచించలేదని, తరువాత అంపైర్లు నా దగ్గరికి వచ్చి పెనాల్టీ గురించి చెప్పారని వివరించాడు. ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్ జట్టు 211 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Story first published: Sunday, March 11, 2018, 11:39 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి