న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంటర్వ్యూకు హాజరైన సింగ్, హెసన్‌: టీమిండియా కోచ్ ఎవరో తెలిసేది అప్పుడే!

LIVE: Kapil Dev-led CAC begins interviews for India head coach job: All you need to know

హైదరాబాద్: టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఇందుకోసం కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ కమిటీ ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసింది.

ఈ ఆరుగురిని శుక్రవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒకరిద్దరు మినహా నేరుగా ఇంటర్వ్యూలు హాజరయ్యే అవకాశాలు లేవు. విండిస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి స్కైప్‌ ద్వారా కమిటీతో మాట్లాడతారు. మరోవైపు విదేశీ అభ్యర్థులు సైతం ఇలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు.

Aug 16, 2019, 2:15 pm IST

టామ్ మూడీ గురించి

భారత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2001లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా, కోచ్‌గా సేవలందించాడు. 2005లో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2007 ప్రపంచకప్‌లో ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, ఐపీఎల్‌లో తొలుత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు కోచ్‌గా పనిచేశాడు. అనంతరం 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్‌గా పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి మొన్నటి సీజన్ వరకు ఆరేళ్ల పాటు... సన్‌రైజర్స్‌ ఐదుసార్లు క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించగా, 2016లో టైటిల్‌ అందుకుంది. బౌలింగ్‌ వనరులనే ప్రధాన ఆయుధంగా మార్చుకొని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ను టామ్‌ గొప్ప జట్టుగా తీర్చిదిద్దాడు. ఆటగాళ్లలో నిత్యం స్ఫూర్తి నింపుతూ జట్టును విజయాల బాట పట్టించాడు.

Aug 16, 2019, 1:17 pm IST

హెడ్ కోచ్ రేసులో ఉన్న రవిశాస్త్రి గురించి

టీమిండియాకు 2017, జులై 13 పూర్తిస్థాయిలో కోచింగ్‌ బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి కోచింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఒత్తిడిని దరికి చేరనీయడు. ఆటగాళ్ల నిర్ణయాలను గౌరవిస్తాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది. రవిశాస్త్రి కోచింగ్‌లోనే ఆస్ట్రేలియాపై 2-0తో టెస్టు సిరీస్‌ను నెగ్గి ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి మినహా లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ సైతం రవిశాస్త్రి పట్ల సానుకూలంగా ఉన్నాడు.

Aug 16, 2019, 12:15 pm IST

హాజరైన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్

టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూ కోసం న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ ముంబైలో బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. బిసిసిఐ షార్ట్ లిస్ట్ చేసిన ఆరుగురు అభ్యర్థులలో ఆయన ఒకరు.

Aug 16, 2019, 12:13 pm IST

ఈరోజు సాయంత్రం 7 గంటలకు

శుక్రవారం రాత్రి 7 గంటలకల్లా టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్నది తేలనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రెస్ మీట్ పెట్టి మరీ టీమిండియా హెడ్ కోచ్ ఎవరో ప్రకటించనుంది. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Aug 16, 2019, 12:03 pm IST

ఇంటర్యూకు హాజరైన రాబిన్ సింగ్

టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్దుల్లో ఓకరైన టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఇంటర్యూకు నేరుగా హాజరయ్యారు. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) షార్ట్ లిస్ట్ చేసిన ఆరుగురి అభ్యర్ధుల్లో రాబిన్ సింగ్ ఒకరు.

Aug 16, 2019, 11:57 am IST

బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్న కపిల్ దేవ్

క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కమిటీలో సభ్యుడిగా ఉన్న కపిల్ దేవ్ ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

Aug 16, 2019, 11:55 am IST

ఉదయం 10.30 గంటలకు హెడ్ కోచ్ ఇంటర్యూ ప్రారంభం

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఇంటర్యూ ప్రారంభమైంది. ఇందుకోసం క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంది.

Aug 16, 2019, 11:53 am IST

సహాయ సిబ్బందిని ఎంపిక చేసేది ఎవరో తెలుసా?

హెడ్ కోచ్‌ను ఎంపిక చేసిన అనంతరం.. సహాయ సిబ్బందిని ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మినహా మిగతా సిబ్బంది యథాతథంగా ఉంటారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. సహాయక సిబ్బంది కోసం జరిగే ఇంటర్వ్యూలో మాజీ సెలెక్టర్‌ విక్రమ్‌ రాథోడ్‌, ప్రమీణ్‌ ఆమ్రే, జాంటీ రోడ్స్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ స్థానంలో విక్రమ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడికి ఆమ్రే, ఇంగ్లండ్‌ మాజీలు జొనాథన్‌ ట్రాట్‌, రాంప్రకాష్‌ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఒకవేళ రాథోడ్‌ను సెలెక్ట్‌ చేస్తే తనకు విరుద్ధ ప్రయోజనాలేమి లేవని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

Aug 16, 2019, 11:51 am IST

మరోసారి రవిశాస్త్రికే అవకాశమిస్తారా?

ప్రస్తుత కోచింగ్‌ బృందం కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగిసినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల కాంట్రాక్టును పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. కొత్త కోచ్ నియామక ప్రక్రియ కోసం బీసీసీఐ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక విషయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మరో విధంగా ఆలోచిస్తోందా! అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Aug 16, 2019, 11:50 am IST

కోహ్లీ మద్దతు రవిశాస్త్రికే!

కెప్టెన్‌ కోహ్లి బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించాడు. కమిటీ సభ్యుడైన అన్షుమన్‌ గైక్వాడ్‌ సైతం అతడి పట్ల సానుకూలత వ్యక్తం చేశాడు. దీంతో రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌ పదవి దక్కొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణంగా కోచ్‌గా రవిశాస్త్రి ట్రాక్ రికార్డే. శాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది.

Aug 16, 2019, 11:48 am IST

కోచింగ్ స్టాఫ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్ధులు:

బ్యాటింగ్ కోచ్: విక్రమ్ రాథోర్, సంజయ్ బంగర్ (ప్రస్తుత కోచ్), జోనాథన్ ట్రోట్, తిలాన్ సమరవీర, లాల్‌చంద్ రాజ్‌పుత్, హృషికేశ్ కనిత్కర్, అమోల్ మజుందార్, అరుణ్ కుమార్, మార్క్ రాంప్రాకాష్, షిబ్ సుందర్ దాస్, జాన్ లూయిస్, మిథున్ అమ్రేస్. బౌలింగ్ కోచ్: వెంకటేష్ ప్రసాద్, భారత్ అరుణ్ (ప్రస్తుత కోచ్), క్లింట్ మెక్కే, దొడ్డ గణేష్, డారెన్ గోఫ్, సుబ్రోటో బెనర్జీ, పరాస్ మంబ్రే, సునీల్ జోషి, అమిత్ భండారి. ఫీల్డింగ్ కోచ్: అభయ్ శర్మ, ఆర్ శ్రీధర్ (ప్రస్తుత కోచ్) మరియు జోంటి రోడ్స్.

Story first published: Friday, August 16, 2019, 14:16 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X