అసలేం జరిగింది?: ఊతప్పకు యువరాజ్ వార్నింగ్! (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరువయ్యే కొద్దీ ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు హద్దులు దాటుతున్నాయి. ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా ఆదిలోనే వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌‌లో సిద్ధార్థ కౌల్ బౌలింగ్‌లో షాట్ కోసం ప్రయత్నించిన గంభీర్ (11) పరుగుల వద్ద రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో జట్టు స్కోరు 23 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఆదే ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన రాబిన్ ఉతప్ప నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వస్తూ బౌలర్ సిద్ధార్థ కౌల్‌ని ఉద్దేశపూర్వకంగానే ఢీ కొన్నాడు. ఉతప్ప ప్రవర్తనతో బౌలర్‌ ఊరుకున్నప్పటికీ, ఫీల్డ్ అంపైర్‌తో పాటు హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్... ఊతప్పను సున్నితంగా హెచ్చరించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే వర్షం రావడంతో డగౌట్‌వైపు వెళ్తున్న ఊతప్ప దగ్గరికి వెళ్లిన సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అలా చేయడం ఆమోదయోగ్యంగా లేదంటూ భుజంపై చెయ్యివేసి సున్నితంగా సూచించాడు. దీనికి ఊతప్ప కూడా పొరపాటు జరిగిందని తెలుపుతూ ఓకే అని చెప్పడం విశేషం.

ఐపీఎల్: వార్నర్ విధ్వంసం, కోల్‌కతాపై ఘన విజయం

కాగా, ఈ మ్యాచ్‌లో రాబిన్ ఊతప్ప (28 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సులు)తో అర్ధసెంచరీ చేసినా అతనికి ఎవరూ సహకారం అందించకపోవడంతో చివరికి కోల్‌కతా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

Story first published: Monday, May 1, 2017, 12:18 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి