ఐపీఎల్ 2018: రాజస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా అమోల్ మజుందార్‌

Posted By:
IPL 2018: Rajasthan Royals appoint former domestic stalwart Amol Mazumdar as batting coach

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ డొమెస్టిక్ క్రికెటర్ అమోల్ మజుందార్‌ను నియమించుకుంది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తన తొలి క్యాంప్‌ని మార్చి 13 నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో నిర్వహించనుంది. ఈ క్యాంప్‌కు రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లు అంతా హాజరుకానున్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ జుబిన్ బారుచా, ఇటీవలే రాజస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన సాయిరాజ్ బహుతులే కూడా ఈ క్యాంప్‌లో పాల్గొనున్నారు. ఈ క్యాంప్‌ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రికెట్ స్కిల్స్‌తో పాటు టీమ్ బిల్డింగ్ ఎక్సర్‌‌సైజులపై ఆటగాళ్లతో చర్చించనున్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని, ఆటగాళ్లతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నానని అమోల్ మజుందార్‌ పేర్కొన్నాడు. తన ఇరవై ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో అమోల్ మజుందార్‌ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.

అంతేకాదు అతడి సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు మిగతా వారితో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ముంబై జట్టు తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హర్యానాతో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో 260 పరుగులు నమోదు చేశాడు.

తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు. 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన మజుందార్ 48.13 యావరేజితో 11,167 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రంజీ ట్రోఫీ నెగ్గిన ముంబై జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వసీం జాఫర్ తర్వాత మజుందార్ (9,202 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. రంజీల్లో ముంబై తరుపున క్రికెట్ ఆడిన తర్వాత అస్సాం, ఆంధ్ర జట్ల తరుపున కూడా ఆడాడు.

యువ క్రికెటర్లకు క్రికెట్ మెళకువలు నేర్పడంతో ఎప్పుడూ మజుందార్ ముందుంటాడు. అయితే రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జాతీయ జట్టు తరుపున మాత్రం ఆడలేకపోయాడు.

Story first published: Tuesday, March 13, 2018, 18:02 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి