న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ చెలరేగినవేళ పంజాబ్‌పై బెంగళూరు ఘన విజయం

By Nageshwara Rao
IPL 2018 LIVE Cricket Score: Match 8: RCB vs KXIP Match at Bangalore Chinnaswamy Stadium

హైదరాబాద్: సొంతగడ్డపై కింగ్స్‌ఎల్‌వన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు తొలి ఓవర్‌లో మెకల్లమ్‌ డకౌట్‌తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, మరో ఓపెనర్‌ డికాక్‌తో కలసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఈ తరుణంలో కోహ్లీ (21) యువ స్పిన్నర్ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ అద్భుత బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు చేర్చాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌, అప్పటికే జోరు మీదున్న డికాక్‌తో కలిసి నెమ్మదిగా స్కోరుబోర్డుని పరిగెత్తించాడు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన అశ్విన్‌ వరుస బంతుల్లో డికాక్‌(45), సర్ఫరాజ్‌ఖాన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్‌తో కలసి డివిలియర్స్‌ వరుస సిక్సర్లతో చెలరేగాడు.

ఈ క్రమంలో 36 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన డివిలియర్స్‌(57) బౌండరీ లైన్‌ వద్ద కరుణ్‌ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్ నాలుగో బంతికి మన్‌దీప్‌ కూడా రనౌటయ్యాడు.

దీంతో అభిమానుల్లో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ, చేధించాల్సిన పరుగులు తక్కువగా ఉండటం చివరి ఓవర్లో సుందర్‌ ఫోర్‌ కొట్టడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా, అక్షర పటేల్, ముజీబ్, ఆండ్రు టై తలో వికెట్ తీసుకున్నారు.


వరుస బంతుల్లో డికాక్, సర్ఫరాజ్ ఔట్
156 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు జట్టు వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ డికాక్ (45) పంజాబ్ స్పిన్నర్ అశ్విన్ విసిరిన బంతిని అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డవగా.. తర్వాత బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 88/3తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మన్దీప్ సింగ్ (1), డివిలియర్స్ (19) పరుగులతో ఉన్నారు.


కోహ్లీని ఔట్ చేసిన ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నెమ్మదిగా ఆడుతోంది. దూకుడుగా ఆడుతోన్న ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆప్ఘన్ యువ కెరటం ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఓ అద్భుతమైన బంతికి కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్వింటన్‌ డికాక్‌ (22), ఏబీ డివిలియర్స్‌ (4) పరుగులతో ఉన్నారు.


3 ఓవర్లకు బెంగళూరు 22/1
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. అక్షర్‌ పటేల్‌ వేసిన బంతిని షాట్‌ ఆడిన మెక్‌కలమ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు వికెట్‌ నష్టానికి 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డికాక్‌ (9), కెప్టెన్‌ కోహ్లీ (12) పరుగులతో ఉన్నారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ లక్ష్యం 156

బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ 19.2 ఓవర్లలో 155 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనకు 156 పరుగుల సాధారణ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తొలి మ్యాచ్‌ జోరునే కొనసాగించడంతో చక్కటి శుభారంభం లభించింది.

ఈ సమయంలో పేసర్ ఉమేశ్ యాదవ్(3/23) తన అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఉమేశ్‌ వేసిన నాలుగో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (15) కీపర్‌ డికాక్‌ అద్బుత క్యాచ్‌కు వెనుదిరగగా.. రెండో బంతికి హిట్టర్‌ ఆరోన్‌ ఫించ్‌ గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.

ఇక చివరి బంతికి యువరాజ్‌ సింగ్‌ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్‌ తనదైన శైలిలో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ (47) వాషింగ్టన్‌ సుందర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు.

ఆ తర్వాత పంజాబ్ జట్టు కరుణ్‌ నాయర్‌ (29), స్టోయినిస్‌ (11), అక్షర్‌ పటేల్‌(2)ల వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. ఈ మూడింటిలో రెండు వికెట్లను బెంగళూరు రివ్యూల ద్వారా సాధించింది. దీంతో భారీ స్కోరు దిశగా సాగుతోన్న పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలింది.

చివర్లో కెప్టెన్‌ అశ్విన్‌(33) రాణించినప్పటికీ పంజాబ్ 19.2 ఓవర్లకు గాను 155 పరుగులు చేసిన అలౌటైంది. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌కు మూడు, కెజ్రోలియా, సుందర్‌, క్రిస్‌ వోక్స్‌ తలో రెండు వికెట్లు తీయగా చాహల్‌లకు ఒక వికెట్‌ లభించింది.


కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ మిస్
బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. హాఫ్ సెంచరీకి ముందు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (47; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) ఔటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ను క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణ్‌ నాయర్‌(26), మార్కస్‌ స్టొయినిస్‌(3) పరుగులతో ఉన్నారు.


ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్
బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు ఉమేశ్ యాదవ్. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న పంజాబ్‌ను ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో భలేగా దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి మయాంక్ అగర్వాల్‌ను పెవిలియన్ పంపిన ఉమేశ్ (15), రెండో బంతికే అరోన్ ఫించ్ (0)ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అదే ఓవర్ చివరి బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (4)ను ఔట్ చేశాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణ్ నాయర్ (5), లోకేశ్ రాహుల్ (23) ఉన్నారు.


3 ఓవర్లకు పంజాబ్‌ 38/0
బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ దూకుడుగా ఆడుతోంది. ఈ సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్‌లో కూడా చెలరేగుతున్నాడు. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ కూడా దూకుడుగా ఆడుతూ పంజాబ్ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 38 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌(16), మయాంక్‌ అగర్వాల్‌ (15) ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో సొంతగడ్డపై కోహ్లీ సేన ఆడుతోన్న తొలి మ్యాచ్‌ ఇది.

సొంత మైదానంలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో విరాట్ కోహ్లీ సేన ఉంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు సునీల్‌ నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌, నితీష్‌ రాణా అల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మరోవైపు టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘన విజయంతో బోణి కొట్టిన పంజాబ్ జట్టు ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ రికార్డుల్ని తిరగరాస్తూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక, పంజాబ్ బౌలర్లు కూడా తొలి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. కర్ణాటకకు చెందిన కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ సొంతగడ్డపై విజృంభిస్తారని అటు పంజాబ్‌ అభిమానులు ఇటు బెంగళూరు ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

ఈ యువ ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండా బెంగళూరు బరిలోకి దిగుతుండగా.. పంజాబ్‌ మాత్రం డేవిడ్ మిల్లర్‌ స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ను తీసుకుంది. ఇదిలా ఉంటే పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌‌ను ఈరోజు కూడా బెంచ్‌కే పరిమితం చేశారు.

జట్ల వివరాలు:
బెంగళూరు:

బ్రెండన్ మెకల్లమ్, క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్, క్రిస్ వోక్స్, వాషింగ్టన్ సుందర్, కుల్వంత్ ఖెజ్రోలియా, ఉమేష్ యాదవ్, యుజువేంద్ర చాహల్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, యువరాజ్ సింగ్, అరోన్ ఫించ్, కురుణ్ నాయర్, మార్కస్ స్టోయిన్స్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), ఆండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబుర్ రహ్మాన్

Story first published: Saturday, April 14, 2018, 0:03 [IST]
Other articles published on Apr 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X