నెట్‌లో వైరల్: కోహ్లీ గడ్డం పట్టుకున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా?

Posted By:

హైదరాబాద్: టీమిండియా, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. కోహ్లీ పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల లైక్స్, వేల కామెంట్లు సొంతం చేసుకుంది. ఆ ఫోటో ఓ చిన్న పాప‌ను కోహ్లీ ఎత్తుకుని ఉన్నాడు.

ఈ ఫొటోని చూసి విరాట్ కోహ్లీ అభిమానులు తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ పాప అనుకుంటున్నారా? ఈ పాప పేరు హినయ‌. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూతురు. ఐపీఎల్‌ పదో సీజన్‌ సందర్భంగా భజ్జీ కూతురును ముద్దాడుతూ కోహ్లీ కనిపించాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ అనంతరం హర్భజన్ సింగ్ ముద్దుల కుమార్తెను ఎత్తుకొని కోహ్లీ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నాడు.

'చిన్నారులు ఎంతో క్యూట్‌గా, అందంగా ఉంటారు. ఇక్కడ చూడండి.. బేబీ హినయ నా గడ్డంలో ఏదో వెతుకుతుంది. హర్బజన్, గీతాబస్రా దంపతులకు దేవుడు అంతా మంచి జరిగేలా చూడాలి' అంటూ కోహ్లీ కామెంట్‌ కూడా పెట్టాడు. కాగా, సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలైంది.

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇలాంటి ఫొటో పోస్ట్ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివాతో క‌లిసి దిగిన ఫొటోను ఇలాగే త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అప్పట్లో ఆ సెల్ఫీ కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, May 2, 2017, 15:52 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి