వార్నర్ విధ్వంసం: సన్‌రైజర్స్‌ ‘తియ్యని వేడుక’ను చేసుకుందిలా!

Posted By:

హైదరాబాద్: సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై ఎదురన్నదే లేకుండా పోయింది. ఐపీఎల్ పదో సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై విజయం సాధించిన ప్రతిసారీ, ఆ విజయానికి కారకుడైన ఆటగాడితో కలిసి తియ్యని వేడుకను చేసుకోవడం ఇప్పటికే పలుమార్లు చూశాం.

తాజాగా ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 48 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 126; 10 ఫోర్లు, 8 సిక్సుల)తో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోశాడు.

బౌండరీలతో చెలరేగిన వార్నర్

బౌండరీలతో చెలరేగిపోయాడు. అటు ఫాస్ట్ బౌలర్లు, ఇటు స్పిన్నర్లు అని కనికరం లేకుండా పరుగుల మోత మోగించాడు. ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. శిఖర్ ధావన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తే, మరొకవైపు వార్నర్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే 20 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన వార్నర్.. ఆపై మరో 23 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తొలి వికెట్ 139 పరుగులు

వీరిద్దరూ తొలి వికెట్ 139 పరుగులు జోడించిన తర్వాత ధావన్ అవుటయ్యాడు. అనవసరపు పరుగు కోసం యత్నించిన శిఖర్ ధావన్‌ను కుల్దీప్ యాదవ్ రనౌట్ చేశాడు. దాంతో 12.3 ఓవర్ల వద్ద సన్ రైజర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ వేసిన 16 ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్ల సాధించి స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

20 ఓవర్లకు సన్ రైజర్స్ 209

అదే క్రమంలో పదిహేడో ఓవర్ రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించిన వార్నర్ అవుటయ్యాడు. దాంతో 171 పరుగుల వద్ద సన్ రైజర్స్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (40) రాణించగా, యువరాజ్ సింగ్ (6 నాటౌట్) మెరవడంతో హైదరాబాద్‌ 209/3తో నిలిచింది.

సత్తా చాటిన సన్ రైజర్స్ బౌలర్లు

అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టుని సన్ రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (2/29), మహ్మద్‌ సిరాజ్‌ (2/26), సిద్ధార్థ్‌ కౌల్‌ (2/26), రషీద్‌ఖాన్‌ (1/38) చకచకా పెవిలియన్‌కు పంపించడంతో విజయం హైదరాబాద్‌ వశమైంది.

హోటల్‌లో కేక్ కట్ చేసి సంబరాలు

ఈ విజయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హోటల్‌లో కేక్ కట్ చేసి మరీ జరుపుకున్నారు. పరస్పరం అభినందలు తెలుపుకొన్నారు. సెల్ఫీలతో సందడి చేశారు. ఎప్పుడూ ఇతరులకు కేక్‌ పూసేందుకు ముందుండే వార్నర్‌ ఈసారి తనకు కేక్‌ పూస్తుంటే వద్దన్నాడు. దీంతో సహచరులు ఊరుకుంటారా? తలో చేయి వేసి వార్నర్ ముఖం మొత్తానికి కేక్ పూశారు.

Story first published: Monday, May 1, 2017, 15:23 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి