అది నా డ్రీమ్ జట్టు కాదు: నకిలీ ఖాతా అని చెప్పిన గంగూలీ

Posted By:

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన డ్రీమ్ ఐపీఎల్ జట్టు ప్రకటించినట్లు గురువారం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గంగూలీ ప్రకటించిన టీ20 జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి స్థానం లేకపోవడం క్రికెట్‌ అభిమానుల్లో చర్చకు దారితీసింది.

దీనిపై శుక్రవారం గంగూలీ స్పందించాడు. అసలు తాను ఎలాంటి డ్రీమ్ టీమ్‌ని ప్రకటించలేదని స్పష్టం చేశాడు. అది తన ట్విటర్‌ అకౌంట్‌ కాదని తేల్చి చెప్పాడు. 'ఇప్పుడే చూశాను.. నా పేరుతో ఉన్న ఐపీఎల్‌ ఫాంటసీ జట్టుని. అయితే ఇది నా ట్విటర్‌ అకౌంట్‌ కాదు.. నా జట్టూ కాదు. నేను ఎలాంటి ఫాంటసీ లీగ్‌లో పాల్గొనను. ఇది పూర్తిగా నకిలీ' అని గంగూలీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌ జరుగుతున్న నేపథ్యంలో గురువారం గంగూలీ డ్రీమ్ టీమ్ ఇదేనంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి గంగూలీ చోటు కల్పించలేదు. ధోని స్థానంలో యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు అవ‌కాశం కల్పించినట్లు ఉంది.

ఇక టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన సురేశ్ రైనాకు కూడా గంగూలీ చోటు కల్పించలేదు. ఇటీవలే ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని ఇటీవలే సౌరభ్ గంగూలీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ పేరుతో వచ్చిన కలల జట్టులో ధోనికి చోటు లేకపోవడంతో పెద్ద చర్చకు దారితీసింది.

Story first published: Friday, April 28, 2017, 14:51 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి