ఐపీఎల్: ఆఖరి ఓవర్ టెన్షన్, కోహ్లీసేనపై ముంబై ఘన విజయం

Posted By:

హైదరాబాద్: ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి ఓవర్ షేన్ వాట్సన్‌ బౌలింగ్ వేశాడు. మొదటి నాలుగు బంతులు సింగిల్స్ తీశారు. అయితే ఐదో బంతికి రోహిత్ ఫోర్ బాది మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేశాడు.

ముంబై విజయ లక్ష్యం 163

ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో ముంబై విజయ లక్ష్యాన్ని 163 పరుగులుగా నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు), మన్‌దీప్ సింగ్ (13 బంతుల్లో 17; 3 ఫోర్లు) నిలకడగా ఆడటంతో బెంగళూరు 3.3 ఓవర్లలోనే 31 పరుగులు చేసింది.

ఈ దశలో మన్‌దీప్ సింగ్‌‌ని స్పిన్నర్ క్రునాల్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మరో 9 పరుగుల వ్యవధిలోనే మెక్లనగాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన అవుటయ్యాడు. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సుల)తో చెలరేగాడు.

ముంబై స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు మరోసారి పరుగెత్తింది. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 12; 1x4) కూడా డివిలియర్స్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో మరోసారి క్రునాల్ పాండ్య బెంగళూరును తన బౌలింగ్‌తో దెబ్బతీశాడు.

11వ ఓవర్ మూడో బంతికి క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (12) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం 13వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ క్యాచ్ ఇచ్చి పెవివియన్‌కు చేరాడు. 27 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.

ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో 14వ ఓవర్ నాలుగో బంతికి షేన్ వాట్సన్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పవన్ నేగి (23 బంతుల్లో 35; ఒక ఫోర్, 3 సిక్సులు), కేదార్ జాదవ్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) రాణించడంతో బెంగళూరు 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో మెక్లనగాన్ మూడు వికెట్లు తీయగా.. క్రునాల్ పాండ్య రెండు, కర్ణ్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

శామ్యూల్‌ బద్రి స్థానంలో షేన్‌ వాట్సన్‌ జట్టు తుది జట్టులోకి రాగా సచిన్ బాబి స్థానంలో మన్దీప్, స్టువర్ట్ బిన్ని స్థానంలో అంకిత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు గాయం కారణంగా హర్భజన్ సింగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో కర్ణ్‌శర్మ జట్టులోకి వచ్చాడు.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), డివీలియర్స్, షేన్ వాట్సన్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్(వికెట్ కీపర్), పవన్ నేగి, ఆడమ్ మిల్నే, శ్రీనాథ్ అరవింద్, అంకింత్ చౌదరి, యజ్వేంద్ర చాహల్.

ముంబై ఇండియన్స్ : పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), జోస్ బట్లర్, నితీష్ రానా, రోహిత్ శర్మ(కెప్టెన్), కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, హర్ధిక్ పాండ్యా, కర్న్ శర్మ, మిచెల్ మెక్లెంగన్, జాస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ.

Story first published: Monday, May 1, 2017, 15:57 [IST]
Other articles published on May 1, 2017
Read in English: IPL 2017: RCB to bat first

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి