ఐపీఎల్: ఫామ్‌లోకి వచ్చిన యువీ, ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి

Posted By:

హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు సంజు శాంసన్‌(19 బంతుల్లో 24), కరుణ్‌ నాయర్‌ (20 బంతుల్లో 39) జట్టుకు చక్కటి శుభారంభాన్నిచ్చారు. జట్టుస్కోరు 40 వద్ద సంజు శాంసన్‌ వికెట్‌ కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్‌ నాయర్‌ కెప్టెన్‌ దూకుడుగా ఆడాడు.

72 పరుగుల వద్ద నాయర్‌.. సిద్దార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌(20 బంతుల్లో 34; 4 ఫోర్లు, ఒక సిక్సు), శ్రేయాస్‌ అయ్యర్‌(25 బంతుల్లో 33) పరుగులతో ఢిల్లీని గెలుపుదిశగా నడిపించారు. 148 పరుగుల వద్ద శ్రేయాస్‌ అయ్యర్ పెవిలియన్‌కు చేరడంతో దిల్లీపై ఒత్తిడి పెరిగింది.

చివర్లో కోరె అండర్సన్ (24 బంతుల్లో 41 నాటౌట్), క్రిస్‌ మోరీస్‌(7 బంతుల్లో15నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులతో అలవోక విజయాన్ని సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ రెండు, భువనేశ్వర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ తలో వికెట్‌ తీశారు.

ఢిల్లీ విజయ లక్ష్యం 186

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ విజయ లక్ష్యం 186 పరుగులుగా నిర్దేశించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్సు), శిఖర్‌ ధావన్‌ (17 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్సు)తో చక్కటి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ఈ ఇద్దరూ పోటాపోటీగా భారీ షాట్లతో చెలరేగి తొలి 5 ఓవర్లలో 49 పరుగులు చేశారు.

Yuvaraj Singh

అయితే ఆరో ఓవర్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను షమీ ఎల్బీగా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌(24 బంతుల్లో 24)తో కలిసి ధావన్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డుని పరుగులెత్తించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌గా విలియమ్సన్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. వీరిద్దరి జోడీ చివరి నాలుగు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 41 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్‌ సాయంతో 70 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మహ్మద్ షమీ 2, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు.

సన్‌రైజర్స్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడుతుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో కోల్‌కతాను వెనక్కి నెట్టి రెండో స్ధానానికి ఎగబాకుతుంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో శామ్ బిల్లింగ్స్‌, జయంత్‌ యాదవ్‌ స్థానాల్లో మాథ్యూస్‌, జయంత్‌ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో తుది జట్టులో దీపక్‌హుడా తిరిగొచ్చాడు.

ఐపీఎల్ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. జట్టుని ముందుండి నడిపించడంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన వార్నర్ 459 పరుగులతో టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో 'ఆరెంజ్‌ క్యాప్‌'ను తన సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఆరింటిలో విజయం సాధించగా, మూడింట ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

దీంతో 13 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిన ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో నాలుగు పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ ఆడబోయే చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సొంతగడ్డపైనే ఆడనుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, నమాన్ ఓజా, భువనేశ్వర్ కుమార్, రషిద్ ఖాన్, సిద్ధార్ద్ కౌల్, మొహ్మద్ సిరాజ్

ఢిల్లీ డేర్‌డెవిల్స్: కరుణ్ నాయర్(కెప్టెన్), సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, ఏంజులా మాథ్యూస్, రిషబ్ పంత్, క్రిస్ మోరిస్, కోరీ అండర్సన్, జయంత్ యాదవ్, రబడా, అమిత్ మిశ్రా, మొహ్మద్ షమీ

Story first published: Tuesday, May 2, 2017, 19:50 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి