వాలెంటైన్స్ డే స్పెషల్: కుల్దీప్‌తో చాహల్ బ్రోమాన్స్ (ట్వీట్)

Posted By:
India vs South Africa: Yuzvendra Chahal's Valentine's Day Bromance With Kuldeep Yadav

హైదరాబాద్: సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుని కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో ఆతిత్య దక్షిణాఫ్రికాపై 73 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం భారత్ తన మొదటి ర్యాంకుని పదిలం చేసుకుంది.

సఫారీ గడ్డపై ప్రస్తుతం జరుగుతోన్న ఆరు వన్డేల సిరీస్‌లో టీమిండియా విజయాల్లో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్‌లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమ స్పిన్‌తో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు. తమ అద్భుత ప్రదర్శనతో కుల్దీప్-చాహల్‌ల జోడి సఫారీ గడ్డపై అరుదైన రికార్డును అందుకుంది.

ఐదు మ్యాచ్‌ల్లోనే వీరిద్దరూ కలిసి 30 వికెట్లు తీశారు. తద్వారా దక్షిణాఫ్రికాలో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు పడగొట్టిన ద్వైపాక్షిక సిరీస్‌‌గా ఈ ఆరు వన్డేల సిరిస్ నిలిచింది. విదేశాల్లో భారత స్పిన్నర్లు ఈ స్థాయి ప్రదర్శన చేయడం కూడా ఇదే తొలిసారి. ఆదో వన్డేలో నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్.. ఇప్పటివరకు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ రికార్డుని అధిగమించాడు. 1998లో దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో మురళీ ధరన్ 14 వికెట్లు తీశాడు. కుల్దీప్ ఇప్పటి వరకూ 17 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయగా 8 మ్యాచ్‌ల్లో 3 వికెట్ల చొప్పున తీశాడు.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మణికట్టు స్పిన్నర్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరు కలిసి దిగిన ఓ ఫోటోని ట్వీట్ చేసిన చాహల్ దానికి 'బ్రోమాన్స్' అనే ట్యాగ్‌ని జత చేస్తూ 'కుల్, చా సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అందరికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు' అంటూ చాహల్ తన ట్వీట్‌‌లో పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 14, 2018, 17:18 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి