వాషింగ్టన్: కరేబియన్ వీరులతో మరో యుద్ధానికి భారత్ సన్నద్ధమౌతోంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశ జట్టుతో ఇవ్వాళ నాలుగో టీ20 ఇంటర్నేషనల్ ఆడబోతోంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్ అమెరికాకు షిఫ్ట్ అయింది. ఫ్లోరిడాలోని లాండర్‌హిల్‌లో గల సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇప్పటికే రెండు జట్ల ప్లేయర్లు మియామికి చేరుకున్నాయి.
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే ఈ నాలుగో టీ20.. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్. ఇప్పటికే 2-1 తేడాతో భారత్ ఆధిక్యతలో ఉంది. టీమిండియా దీన్ని గెలిస్తే.. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను చేజిక్కించుకున్నట్టవుతుంది. ఇందులో విజయం సాధించిన ఆధిక్యతను సమం చేయాలనే పట్టుదలతో ఉంది వెస్టిండీస్ జట్టు. అదే జరిగితే- ఆదివారం ఇదే స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ హైఓల్టేజ్‌గా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
Hello from Florida, US! 👋#TeamIndia | #WIvIND pic.twitter.com/VZkMYeclmr
— BCCI (@BCCI) August 5, 2022
ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డు పడే అవకాశాలు దాదాపుగా లేవు. మ్యాచ్ కొనసాగడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. క్లియర్ స్కై. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ ఎండ వేడి పెరిగుతుందే తప్ప, వర్షం పడటానికి అనుకూలత లేదని ఫ్లోరిడా మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఉదయం 10 గంటల సమయంలో 29 డిగ్రీలుగా ఉండే ఉష్ణోగ్రత.. మధ్యాహ్నం 3 గంటల వరకు గరిష్ఠంగా 33 డిగ్రీల వరకూ చేరుకోవచ్చని అంచనా వేసింది.
లాండర్‌హిల్ పిచ్.. పక్కా టీ20 ఫార్మట్‌కు అనుకూలించేది. అమెరికాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదనే విషయం తెలిసిందే. ఈ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య కూడా చాలా తక్కువే. క్రికెట్‌కు అనుకూలంగా లాండర్‌హిల్ స్టేడియాన్ని తీర్చిదిద్దినప్పటి నుంచీ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇది 14వది. ఇదే స్టేడియంలో భారత్-వెస్టిండీస్ తలపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. 2016 నుంచి 2019 మధ్యకాలంలో ఈ రెండు జట్లు రెండు మ్యాచ్‌లను ఆడాయి.