హెచ్‌సీఏలో ఊహించని పరిణామం: అధ్యక్షునిగా వివేక్‌ అనర్హుడు

Posted By:
HCA president and secretary disqualified

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్‌ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు జి.వివేక్, కార్యదర్శి శేష్‌ నారాయణలపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి అనర్హత వేటు వేశారు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్‌ ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఏసీబీ చార్జిషీటులో శేష్‌నారాయణ్‌ నిందితునిగా ఉన్నందున కార్యదర్శి పదవికి శేష్‌నారాయణ అర్హుడు కాదని వారిద్దరిని ఆయా పదవుల నుంచి తప్పిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు పదవులకు నిబంధనల ప్రకారం మళ్లీ ఎన్నికలు జరపాలని తీర్పులో వెల్లడించారు.

అంతవరకు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులుగా ఉపాధ్యక్షుడు, కోశాధికారి వ్యవహరిస్తారని చెప్పారు. వీరిద్దరూ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ స్పష్టం చేశారు. వివేక్‌, శేష్‌నారాయణలకు వ్యతిరేకంగా మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌, మాజీ ఎంపీ వీహెచ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు వెలువడింది.

వివేక్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. దీంతో పాటు విశాక ఇండస్ట్రీస్‌తో ఆయనకు సంబంధం కూడా ఉంది. హెచ్‌సీఏతో కమర్షియల్‌ కాంట్రాక్టు ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని అంబుడ్స్‌మన్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

పలు అవినీతి కేసుల చార్జ్‌షీట్లలో పేరున్న కారణంగా శేష్‌నారాయణపై అనర్హత వేటు పడిందని తెలిపారు. అంబుడ్స్‌మన్‌ తీర్పుపై వివేక్‌ మాట్లాడుతూ 'అంబుడ్స్‌మన్‌ తీర్పు గురించి ఇప్పుడే విన్నా. నేను చెన్నైలో ఉండడం వల్ల తీర్పులో ఏముందో పూర్తిగా తెలియదు. అంబుడ్స్‌మన్‌ నిర్ణయాన్ని గౌరవిస్తాను' అనిని తెలిపారు.

అయితే, తన విషయంలో అంబుడ్స్‌మన్‌ నిర్ణయం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని తన న్యాయవాది తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.

Story first published: Friday, March 9, 2018, 11:48 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి