న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Happy Birthday Virat Kohli:సక్సెస్‌ఫుల్ కెరీర్.. కానీ అదొక్కటే లోటు!

Happy Birthday Virat Kohli: Team India’s Run Machine Incredible Journey
Virat Kohli తారాజువ్వలా.. ఆ రాత్రి నుంచే కొత్త కోహ్లీ Incredible & Inspiration Journey

శతకవీరా నీకు వందనం.. ద్విశతకధీరా నీకు అభివందనం..! నీవో పరుగుల యంత్రం.. దాసోహం నీకు మైల్ స్టోన్ మంత్రం..! నీవు ఆడితే ఓ విజయం.. నీవు నిలబడితే ఓ ప్రభంజనం..!
వయసుకు మించిన పరిణతి.. శిఖరాన్ని మించిన ఆట.. ప్రపంచాన్ని జయిస్తున్న రికార్డుల వేట..! సారథిగా సరిలేరు నీకెవ్వరూ..ప్లేయర్‌గా సరిరారు నీకెవ్వరూ..! ఇక నిలువదు ఏ రికార్డు మున్ముందు.. శతకాల అర్థసెంచరీని మించావు.. క్రికెట్ దేవుడి దరి చేరుతున్నావు..! టన్నుల కొద్ది పరుగుల చేస్తున్నావు.. దిగ్గజాలను కనుమరుగు చేస్తున్నావు..! నీ ఆటను ఇలానే కొనసాగించు.. మమ్మల్ని అలానే అలరించు..!

ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. ఇరువై ఎనిమిదేళ్లకే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించావు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన నీకు జన్మదిన శుభాకాంక్షలు. విరాట్ కోహ్లీ 33వ ఏట అడుగెడుతున్న సందర్భంగా అతని కెరీర్ విశేషాలు..

 బాల్ బాయ్..

బాల్ బాయ్..

ఢిల్లీలో భారత్‌ టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. బౌండరీ లైన్‌ వద్ద మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫీల్డింగ్‌. గీత అవతల ఉన్న ఓ 10 ఏళ్ల పిల్లాడు ఒక్కసారైనా తనవైపు చూడకపోతాడా అని ఆశతో చేయి ఊపుతూనే ఉన్నాడు. ఆ పిల్లాడి ఉత్సాహం గమనించిన సెహ్వాగ్‌ ఓ చిరు నవ్వు నవ్వాడు. అంతే ఆ పిల్లాడు పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఆ పిల్లాడు కోహ్లీనేనని 16 ఏళ్ల తర్వాత సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట.. 'కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుంటే కళ్లు పక్కకు తిప్పలేం, నా పిల్లలు నా బ్యాటింగ్‌ కంటే విరాట్‌ బ్యాటింగే ఇష్టపడతారు.

' కోహ్లీ ఏ క్రికెటర్‌ పలకరింపు కోసం ఎదురు చూశాడో ఆ క్రికెటర్‌తో ఆడటమే కాకుండా అతని నుంచి ప్రశంసలు పొందాడు. ఇలా అతను ఆరాధ్య దైవంగా భావించిన.. ఒక్కసారైన చూడాలనుకున్న క్రికెటర్లందరితోను ఆడటమే కాక వారి మన్ననలు పొందాడు.

ఆ రాత్రి నుంచే.. కొత్త కోహ్లీ

ఆ రాత్రి నుంచే.. కొత్త కోహ్లీ

2006లో ఢిల్లీ- కర్ణాటక రంజీ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో బ్రెయిన్‌స్ట్రోక్‌తో కోహ్లీ తండ్రి ప్రేమ్‌ కోహ్లీ చనిపోయాడన్న సమాచారం అందింది. కీలక మ్యాచ్‌లో 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉంది. అప్పటికే కోహ్లీ ఓవర్‌నైట్‌ 40 స్కోరుతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని కోచ్‌ ముందు ప్రస్తావించగా అతను ఇంటికెళ్లమని సూచించాడు. అయినా అతడి భావోద్వేగాలు అదుపు తప్పలేదు. అప్పటికే అతని నరనరాల్లోకీ క్రికెట్‌ ఎక్కేసింది.

దానికంటే ఏదీ ఎక్కువ కాదనే నిర్ణయానికి వచ్చేశాడు. కాదు... తండ్రే అతడికా విషయాన్ని నూరిపోశాడు. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని బ్యాటింగ్‌ కొనసాగించాలనీ, శతకం చేసి తండ్రికి అంకితమివ్వాలనీ నిర్ణయించుకున్నాడు. కానీ తొంబై పరుగుల వద్ద అంపైర్‌ తప్పిదం వల్ల అవుటైన కోహ్లీ, శతకం చేయకపోయినా ఆ స్ఫూర్తికి తండ్రి సంతోషించే ఉంటాడన్న నమ్మకంతో నేరుగా అంత్యక్రియలకు బయల్దేరాడు. ఆ రాత్రి నుంచీ తామంతా ఓ కొత్త కోహ్లీని చూశామని తెలిపింది విరాట్‌ తల్లి సరోజ్‌. కోహ్లీ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి నుంచి గట్టెక్కింది.

అండర్‌-19 ప్రపంచకప్‌తో తారాజువ్వలా..

అండర్‌-19 ప్రపంచకప్‌తో తారాజువ్వలా..

2008 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు కెప్టెన్స్‌ వహించిన కోహ్లీ ఓ కొత్త చాంపియన్‌గా నిలిచాడు. సిరీస్‌లో భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్‌ ఆటగాడిగా అదరగొట్టాడు. భారత్‌ను అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలబెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ నుంచి పిలుపొచ్చింది.

ఆపైన శ్రీలంకతో సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది. అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లీ కన్న కల పందొమ్మిదేళ్ల వయసులో నెరవేరింది. ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతో టోర్నీ భారత్‌ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు.

కోహ్లీ ఫస్ట్ సెంచరీకి గంభీర్ ఫిదా

కోహ్లీ ఫస్ట్ సెంచరీకి గంభీర్ ఫిదా

ఎంతటి స్థాయి వ్యక్తికైనా జీవితంలో ఒడిదుడుకులు ఉండటం సహజమే. కోహ్లీ విషయంలోను అదే జరిగింది. వన్డే క్రికెట్‌లో తన ప్రస్థానాన్ని బాగానే ప్రారంభించినా, తరవాతి సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ అందుబాటులోకి రావడంతో కోహ్లీ స్థానం బెంచికే పరిమితమైంది. ఆ తరవాతి సిరీస్‌లో ఏకంగా అతడి చోటే గల్లంతయ్యింది. ఆపైన ఎవరైనా గాయాలపాలైన సందర్భంలో వచ్చిన అవకాశాల్ని రెండు చేతులా అందుకుంటూ, తనను తొలగించలేని పరిస్థితిని సెలెక్టర్లకు కల్పించాడు. ఇలా 2009లో భారత్‌లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ దూరమయ్యాడు.

అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌తో కలిసి సింగిల్స్‌ తీస్తూ తన తొలి శతకాన్ని సాధించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కోహ్లీ ఆటకు ముగ్దుడైన గంభీర్‌ తనకు లభించిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు.

ఆపైన 2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులోనూ తనదైన ముద్ర వేశాడు. మూడేళ్ల వరకూ బాగానే నడిచింది. చిన్న వయసులోనే పేరూ డబ్బూ హోదా వచ్చేశాయి. వాటితో పాటు కాసింత దూకుడూ, నోటి దురుసు కూడా. క్రమంగా మైదానంలో ఆవేశం పెరిగింది. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం, నోరు జారడం మామూలైంది. దీంతో ప్రత్యర్థులతో పాటు విదేశీ అభిమానులకూ కోహ్లీ అలుసైపోయాడు. వైఫల్యాలు మొదలయ్యాయి. ఫలితంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుకు దూరమయ్యాడు. ఆపైన 2012 ఐపీఎల్‌లోనూ చెత్త ప్రదర్శనతో విమర్శలతో పాటు అభిమానుల వెక్కిరింతలకు గురయ్యాడు. ఆటతో పాటు మాటతీరూ తీసుకొచ్చిన ఫలితమది.

కోహ్లీలో అంతర్మథనం..

కోహ్లీలో అంతర్మథనం..

భారత జట్టులో స్థానం కోల్పోవడం పట్ల విరాట్‌లో అంతర్మథనం మొదలైంది. అద్దం ముందు నిల్చోని తనని తాను చూసుకున్నాడు. తన తప్పులు ఏమిటో గ్రహించాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు తనుకు ఉన్న తేడా ఏమిటో గమనించాడు. ఫిట్‌నెస్‌ ఉంటేనే క్రికెట్‌లో రాణించగలమని గ్రహించాడు. వెంటనే తన రూపాన్ని మార్చాలని బరువు తగ్గి ఫిట్‌నెస్‌ సాధించాడు.

మాటలోని దూకుడు ఆటపై మలిచి పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. ప్రత్యర్థుల కవ్వింపులకు, విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ మళ్లీ పుట్టాడు. అవును క్రికెట్‌ ప్రపంచంలో ఓ నవ శకానికి నాందీ పలికాడు. ఆ తరువాత అతడిని తట్టుకోవడం ఎవరి తరం కాలేదు. భారీ లక్ష్యాలను అవలీలగా ఛేదించడం అలవాటైపోయింది. మైదానంలో తనకసలు పోటీనే లేదన్నట్లు దూసుకెళ్తున్నాడు.

ఆ ఒక్కటే లోటు..

ఆ ఒక్కటే లోటు..

కెరీర్‌లో ఎన్నో సాధించినా కెప్టెన్‌గా ఎన్ని ఘనతలు అనుకున్నా.. ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్లేయర్‌గా 2011, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలిచిన కోహ్లీ.. కెప్టెన్‌గా ఒక్క టైటిల్ అందించలేకపోయాడు. వ్యక్తిగతంగా ఎన్ని ఘనతలు సాధించినా.. సగటు క్రికెట్​ అభిమాని ట్రోఫీలనే లెక్కలోకి తీసుకుంటాడు. కానీ కోహ్లీకి ఆ అదృష్టం లేదు.

జట్టు కోసం నిరంతరం తపిస్తూ, చెమట చిందిస్తూ ఆడే అతనికి ఐసీసీ ట్రోఫీ ఎప్పటి నుంచో ఊరిస్తోంది. అదే విమర్శకులకు అస్త్రంగా మారింది. కెప్టెన్​గా జట్టును ఎంతో దృఢంగా మలుస్తూ, యువకులకు ప్రేరణ కలిగిస్తూ ఉండే నాయకుడికి, విదేశీ క్రికెటర్లలోనూ స్థైర్యం నింపే ఈ సారథికి.. ఈ ఒక్క కారణంగా ప్రస్తుతం విమర్శలు తీవ్రమయ్యాయి. అదే అతని కెరీర్‌కు లోటుగా మిగిలిపోయింది.

Story first published: Friday, November 5, 2021, 13:06 [IST]
Other articles published on Nov 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X