2015 వరల్డ్‌కప్‌లో బాల్ టాంపరింగ్ జరిగింది: ఆసీస్‌పై కివీస్ మాజీ క్రికెటర్

Posted By:
Grant Elliot hints at ball-tampering by Australia in 2015 ICC World Cup final

హైదరాబాద్: బాల్ టాంపరింగ్... యావత్ క్రికెట్ ప్రపంచాన్ని గత కొన్ని రోజులుగా కుదిపేస్తోన్న ఘటన. ఈ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఏడాది నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలలు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఈ బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగులోకి రావడంతో గతంలో కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాంట్‌ ఇలియట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు 2015 వరల్డ్‌కప్ ఫైనల్లో బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. శుక్రవారం ఓ రేడియో స్టేషన్‌లో తాజా బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంపై మాట్లాడుతూ '2015 వరల్డ్ కప్ ఫైనల్లో మా జట్టు ఆరంభం బాగుందని, 150 పరుగులకు మూడు వికెట్లే కోల్పోయారు. ఈ సమయంలో బంతి అనూహ్యంగా రివర్స్‌ స్వింగ్‌ అయింది' అని అన్నాడు.

'అప్పటి వరకు మాములుగా బౌలింగ్‌ చేసిన బౌలర్లు బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేశారు. దీంతో నేను బ్యాటింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో వారు బంతి ఆకారాన్ని మార్చేందుకు టాంపరింగ్‌కు పాల్పడి ఉంటారు' అని అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

కాగా, 2015 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గ్రాంట్‌ ఇలియట్‌(83) ఒక్కడే రాణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాల్ టాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన స్మిత్, వార్నర్‌, బాన్‌‌క్రాఫ్ట్‌లపై ఇలియట్ సానుభూతి వ్యక్తం చేశాడు.

స్వదేశానికి తిరుగు పయనమైన సమయంలో జోహెన్స్‌బర్గ్‌ విమానాశ్రయంలో స్మిత్‌ పట్ల అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డాడు. స్మిత్ నేరస్థుడు కాదని, అతడి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని అన్నాడు. 'నేను చూసిన వీడియోలో స్మిత్‌ను ఓ నేరస్థుడిలా పోలీసులు చుట్టుముట్టి మరి తీసుకెళ్లారు. అతనేం నేరస్థుడు కాదు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు' అని అన్నాడు.

కాగా, బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాల్ టాంపరింగ్ వివాదంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు ప్రపంచ క్రికెట్ ముందు దోషులుగా నిలబడటంతో పాటు చెడ్డపేరు తెచ్చుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వీరిపై కఠినంగా చర్య తీసుకుంది.

స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది.

ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది.

క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది. మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ వరకు లీమన్ పదవిలో ఉండాల్సి ఉంది.

అయితే ఈ బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ముందుగానే కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కోచ్‌ని వెతికే పనిలో పడింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా కోచ్ రేసులో జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, జాసన్ గిలెస్పీ, డేవిడ్ సాకర్, టామ్ మూడీలు ఉన్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 19:02 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి