అది నేను కాదు: కోహ్లీ పేరు తప్పుగా రాయడంపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్

Posted By:

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు తెలియదా? అంటూ నెటిజన్లు తనపై చేసిన విమర్శలకు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. తనకు విరాట్ కోహ్లీ పేరు తెలుసు కనుకనే, గతంలో అతడికి ప్రపోజ్ చేశానని డానియెల్లి చెప్పుకొచ్చింది.

'కోహ్లీ అందించిన బ్యాట్‌పై ఉన్న పేరు (VIRAT KHOLI) రాసింది తాను కాదని, బ్యాట్ తయారు చేసిన వారిని అడిగితే బాగుంటుంది' అని ట్విట్టర్‌లో పేర్కొంది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలేం జరిగింది?

2014 వరల్డ్ టీ20 జరిగిన సందర్భంలో విరాట్ కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సోషల్ మీడియాలో అడిగి అప్పట్లో వార్తల్లో నిలిచిన డానియెల్లి యాట్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ బ్యాట్‌ను కానుకగా ఇచ్చాడు. 2014లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించిన సందర్భంలో వీరిద్దరూ కలిసి ఫోటోలు కూడా దిగారు.

అప్పుడే కోహ్లీ తన బ్యాట్‌ను డానియెల్‌కు కానుకగా ఇచ్చాడు. తాజాగా ఈ బ్యాట్‌కు సంబంధించిన ఫొటోని డానియెల్లి ట్విట్టర్‌లో పోస్టు చేసి కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌ను ఇంకా వాడలేదని, త్వరలో ఈ బ్యాట్‌తో ప్రాక్టీస్ చేయనున్నట్లు డానియెల్లి ట్వీట్ చేసింది.

అయితే బ్యాట్ కింద ఉన్న కోహ్లీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ గమనించిన నెటిజన్లు.. కోహ్లీ పేరు కూడా సరిగా తెలియదా? అంటూ ఆమెను ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. తనపై వస్తున్న విమర్శలకు డానియెల్లి స్పందించింది. 'మీరు నాపై కామెంట్ చేస్తారా.. కోహ్లీ బ్యాట్లు తయారుచేసే వ్యక్తి ఈ పని చేశాడు. నేను కాదంటూ' సమాధానమిచ్చింది.

Story first published: Wednesday, September 13, 2017, 12:22 [IST]
Other articles published on Sep 13, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి