టాప్ గ్రేడ్ నుంచి ధోని ఔట్, జాడలేని షమీ: క్రికెటర్లకు భారీగా పెరిగిన జీతాలు

Posted By:
BCCI's new pay structure released: Virat Kohli, Rohit Sharma to earn more than MS Dhoni

హైదరాబాద్: బీసీసీఐ భారత క్రికెటర్ల జీతలు భారీగా పెంచింది. భారత క్రికెట్ (సీనియర్ పురుషులు, సీనియర్ మహిళలు & డొమెస్టిక్ క్రికెట్) కొత్త కాంట్రాక్టు వ్వవస్థను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. తాజా కాంట్రాక్టు ప్రకారం క్రికెటర్లు గతంలో సంపాదించేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇప్పుడు సంపాదిస్తున్నారు.

భారత క్రికెటర్లకు అత్యుత్తమ జీతాలు ఉండాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ (సీఓఏ) ఆటగాళ్ల జీతాలను భారీగా పెంచిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా అక్టోబర్ 2017 నుంచి సెప్టెంబర్ 2018 కాలానికిగాను బీసీసీఐ కొత్త కాంట్రాక్టులను ప్రకటించింది.

ఇప్పటివరకు టాప్ గ్రేడ్‌లో ఉన్న ధోనిని సెలక్టర్లు తప్పించారు. ప్రస్తుతం గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న పేసర్ మహ్మద్ షమిని మొత్తం కాంట్రాక్ట్‌లో నుంచే తొలగించింది. కొత్త కాంట్రాక్టులో రెండు కేటగిరీలను చేర్చింది. సీనియర్ పురుషుల జట్టులో A+ కేటగిరీని చేర్చగా... సీనియర్ మహిళల కోసం C కేటగిరీని చేర్చింది.

తాజా కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ A+లో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి రూ.7 కోట్లు, గ్రేడ్ A లో ఉన్న వారికి రూ.5 కోట్లు, గ్రేడ్ B వారికి రూ.3 కోట్లు, గ్రేడ్ C వారికి రూ. కోటి జీతంగా ఇవ్వనుంది. గ్రేడ్ A+లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు సెలక్టర్లు చోటు కల్పించారు.

ఇక గ్రేడ్ Aలో అశ్విన్, రవీంద్ర జడేజా, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రహానే, ధోని, వృద్ధిమాన్ సాహాలు ఉన్నారు. గ్రేడ్ Bలో కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, పాండ్యా, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లు ఉన్నారు. గ్రేడ్ Cలో కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్దీవ్ పటేల్, జయంత్ యాదవ్‌లు ఉన్నారు.

గతంలో A+ అన్న కేటగిరీయే లేదు. ఎ కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు రూ.2 కోట్లు బీసీసీఐ ఇచ్చేది. దీనిని బట్టి చూస్తే జీతాలు భారీగా పెరిగినట్లే. మరోవైపు మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. గ్రేడ్ Aలో ఉన్న వారికి ఏడాదికి రూ.50 లక్షలు, గ్రేడ్ Bలో ఉన్న వారికి రూ.30 లక్షలు, గ్రేడ్ Cలో ఉన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు.

Story first published: Wednesday, March 7, 2018, 18:56 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి