
హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజాం అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్-హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బాబర్ అజాం 33 పరుగులు చేయడం ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు.
బాబర్ అజాంకు ఇది 47వ వన్డే కాగా 45వ ఇన్నింగ్స్ కావడం విశేషం. ఇక, ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా 40 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన మరో బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్, ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌లు సైతం 45 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఆదివారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. దుబాయి అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 37.1 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.
పాక్ బౌలర్లలో ఉస్మాన్ ఖాన్ (3/19)తో చెలరేగగా.... హసన్ అలీ, షాదాబ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఓపెనర్లు ఇమామ్, ఫఖర్ జమాన్ (24) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత బాబర్ ఆజాం (33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇమామ్ జట్టును నడిపించారు.
ఈ క్రమంలో ఆజాం తన కెరీర్‌లో 2 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలతో రెండు సార్లు ఔట్ కాకుండా తప్పించుకున్న ఇమామ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, షోయబ్ మాలిక్ (9 నాటౌట్) బౌండరీతో విజయాన్ని అందించాడు.