
విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శన
ఈ సిరీస్‌లో టీమిండియా యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ జట్టులో విజయ్ శంకర్ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. విజయ్ శంకరతో పాటు ధోనీ వారసుడిగా గుర్తింపు పొందిన రిషబ్ పంత్, అజింక్య రహానే పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపాడు.

రిషబ్ పంత్ కూడా
సోమవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్ విజయ్ శంకర్, రిషబ్ పంత్, రహానేలు వరల్డ్‌కప్ రేసులో ఉన్నట్లు తెలిపాడు. ఇప‍్పటికే రిషభ్ పంత్ తానెంటో నిరూపించుకోగా, తాజాగా విజయ్ శంకర్‌పై మేనేజ్‌మెంట్ ఒక స్సష్టతకు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై రిషబ్ పంత్ రెండు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ
"న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శంకర్.. కొన్ని భారీ షాట్లతో అలరించాడు. మూడో టీ20లో టీమ్ ఓడినా.. విజయ్ మాత్రం 28 బంతుల్లోనే 43 పరుగులు చేయడం విశేషం. ఈ స్థాయిలో ఉండాల్సిన నైపుణ్యాన్ని అతడు చూపిస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి భారత్-ఎ తరఫున నిలకడగా ఆడుతున్నాడు. అయితే ప్రస్తుత టీమ్‌లో అతడు ఎక్కడ సరిపోతాడన్నది చూడాలి" అని ఎమ్మెస్కే చెప్పాడు.

మూడో ఓపెనర్‌గా రహానే పేరు
ఇక, గతేడాది దక్షిణాఫ్రికాతో చివరిసారి వన్డే మ్యాచ్ ఆడిన రహానే పేరును కూడా మూడో ఓపెనర్‌గా పరిశీలిస్తున్నామని చెప్పి ఆశ్చర్యపరిచాడు. దేశవాళీ క్రికెట్‌లో రహానే బాగా రాణిస్తున్నాడని, అందుకే వరల్డ్‌కప్ జట్టు రేసులో అతడి పేరుని పరిగణనలోకి తీసుకున్నామని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో రహానే 11 ఇన్నింగ్స్‌ల్లో 74.62 సగటుతో 597 పరుగులు సాధంచాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.