బ్యాంకాక్: 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో దిగిన భారత స్టార్ షట్లర్, సైనా నెహ్వాల్ భర్త పారుపల్లి కశ్యప్‌కు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా కశ్యప్ థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నీ తొలి రౌండ్ మధ్యలోనే వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భాగంగా బుధవారం కెనడాకు చెందిన జేసన్ ఆంథోనీ హో-షూతో పోరులో కాలిపిక్క పట్టేయడంతో కశ్యప్ మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు.
ఓపెనింగ్ రౌండ్‌లో కశ్యప్ 9-21, 21-13, 8-14తో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో కశ్యప్ 8-14తో వెనుకబడి ఉన్న సమయంలో కండరాలు పట్టేయడంతో.. పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. తొలి గేమ్‌లో 9-21తో ఓడిన అతడు రెండో గేమ్‌ను 21-13తో గెలుపొందాడు. ఇక గాయం కారణంగా మూడో గేమ్ పూర్తిగా ఆడలేదు. కిదాంబి శ్రీకాంత్ 21-12, 21-11తో సౌరభ్ వర్మను ఓడించాడు. ఇక సమీర్ వర్మ ఇండోనేషియాకు చెందిన షెసర్ హిరెన్ చేతిలో 15-21, 17-21తో ఓడిపోయాడు.
ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిక్‌ఫీల్డ్ చేతిలో 21-16, 24-26, 13-21తో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సింధు రెండో గేమ్‌లో ఓటమిపాలైంది. పోటాపోటీగా సాగిన రెండో గేమ్ ఆదిలో సింధుదే ఆధిపత్యం. కానీ మియా బ్లిక్‌ఫీల్డ్ పుంజుకుని.. మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకువచ్చింది. ఆఖరి గేమ్‌లో జోరును కొనసాగిస్తూ.. బ్లిక్‌ఫీల్డ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.
ఇక పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ సాయి ప్రణీత్ కూడా తొలిరౌండ్‌లోనే నిష్క్రమించాడు. స్థానిక ఆటగాడు వాంగ్‌చరొయిన్ చేతిలో 16-21, 10-21 తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయించడంతో మ్యాచ్ 40 నిమిషాల్లోపే ముగిసింది.
Brisbane Test: టీమిండియాకు మరో షాక్.. బ్రిస్బేన్ టెస్టుకు అశ్విన్ దూరం!!