ఎందుకంత ప్రత్యేకం: అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ప్రణయ్

Posted By:

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మూడో సీజన్‌ కోసం సోమవారం హైదరాబాద్‌లో వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో హెచ్‌ఎస్ ప్రణయ్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ ఏకంగా రూ.62 లక్షలకు ప్రణయ్‌ను సొంతం చేసుకుంది.

దీంతో మూడో సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ప్రణయ్ నిలిచాడు. గత సీజన్‌లో ప్రణయ్‌ రూ. 25 లక్షలు మాత్రమే పలకడం విశేషం. ఈ వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వేలంలో భాగంగా ఒక్కో జట్టుకి ఒక ప్లేయర్‌ని అట్టిపెట్టుకునే అవకాశం వేలం నిర్వాహకులు సూచించారు.

దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్‌ వారియర్స్‌ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను అంటిపెట్టుకున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లు గత సీజన్లో పలికిన రేటు కంటే ప్రణయ్‌కే ఎక్కువ ధర పలకడం విశేషం.

గత సీజన్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌ని రూ.25 లక్షలకు ముంబై రాకెట్స్‌ దక్కించుకుంది. అయితే సోమవారం జరిగిన వేలంలో ప్రణయ్ రూ.62 లక్షలకు అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అతను అందుకుంటున్న మొత్తం 250 శాతానికి పెరిగినట్లయింది.

 అనేక కారణాలు

అనేక కారణాలు

ప్రణయ్ ఇంత ధర పలకడానికి అనేక కారణాలున్నాయి. గతేడాది కాలంగా జరిగిన అంతర్జాతీయ టోర్నీలో ప్రణయ్ అద్భుత విజయాలను సాధించిన కారణంగా ఫ్రాంచైజీలను విపరీతంగా ఆకర్షించాడు. వేలంలో ప్రణయ్ కోసం ముంబై, అహ్మదాబాద్‌ హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి రికార్డు మొత్తాన్ని చెల్లించి ప్రణయ్‌ అహ్మదాబాద్‌ సొంతం చేసుకుంది. నిబంధనల ప్రకారం అట్టిపెట్టుకునే క్రీడాకారులకు గత ఏడాది చెల్లించిన మొత్తం కంటే 25 శాతం అదనంగా చెల్లించాలి. ఆ లెక్కన చూసినా.. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తో పోలిస్తే ప్రణయ్ ఎక్కువ రేటు పలికాడనే చెప్పాలి.

 రెండో అత్యధిక ధర ఆటగాడిగా శ్రీకాంత్

రెండో అత్యధిక ధర ఆటగాడిగా శ్రీకాంత్

ఇక ప్రణయ్ తర్వాత రెండో అత్యధిక ధర ఆటగాడిగా భారత పురుషుల సింగిల్స్ నెంబర్‌వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. రూ. 56.1 లక్షలు వెచ్చించి శ్రీకాంత్‌ను అవధె వారియర్స్ సొంతం చేసుకుంది. ఇక, గతేడాది హైదరాబాద్‌ హంటర్స్‌ తరఫున బరిలో దిగిన యువ ఆటగాడు సాయిప్రణీత్‌ను అదే ఫ్రాంచైజీ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు ధర. గతేడాది రూ.20 లక్షలకే సాయిప్రణీత్‌ను హైదరాబాద్ సొంతం చేసుకుంది.

 అహ్మదాబాద్‌‌కి తై జు యింగ్‌

అహ్మదాబాద్‌‌కి తై జు యింగ్‌

పీబీఎల్ టోర్నీలోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ కోసం కూడా కొత్త టీమ్‌ అహ్మదాబాద్‌ రూ. 52 లక్షలు చెల్లించింది. ఇక, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్‌ హంటర్స్‌ తమతోనే ఉంచుకుంది. మరో సింగిల్స్‌ స్టార్‌ అజయ్‌ జయరామ్‌ కొత్త జట్టు నార్త్‌ ఈస్టర్స్‌ వారియర్స్‌ రూ.44 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది.

రూ. 50 లక్షలకు సంగ్ జీ హ్యూన్ సొంతం చేసుకున్న ఢిల్లీ

రూ. 50 లక్షలకు సంగ్ జీ హ్యూన్ సొంతం చేసుకున్న ఢిల్లీ

ప్రపంచ 5వ ర్యాంక్ క్రీడాకారిణి సంగ్ జీ హ్యూన్ (కొరియా)ను రూ. 50 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో కొత్త ప్రపంచ ఛాంపియన్, నెంబర్‌వన్ ఆటగాడు విక్టర్ అలెక్సన్ (డెన్మార్క్) గతేడాది తానాడిన బెంగళూరు జట్టుకే రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. రెండోర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)ను ఢిల్లీ ఏసర్స్ రూ. 50 లక్షలకు, 10వ ర్యాంకర్ జూ వీ వాంగ్ (చైనీస్ తైపీ)ను రూ. 52 లక్షలకు నార్త్ ఈస్టర్న్ వారియర్స్ కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో డబుల్స్‌ స్పెషలిస్ట్‌లు కూడా భారీ మొత్తం

ఈ సీజన్‌లో డబుల్స్‌ స్పెషలిస్ట్‌లు కూడా భారీ మొత్తం

గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో డబుల్స్‌ స్పెషలిస్ట్‌లు కూడా భారీ మొత్తం పలికారు. మహిళల డబుల్స్‌లో క్రిస్టినా రూ. 42 లక్షలకు అవధె జట్టు కొనుగోలు చేసింది. వేలంలో ప్రతీ జట్టు గరిష్టంగా పదేసి మంది షట్లర్లను ఎంచుకుంది. ఇందు కోసం నిర్దేశించిన రూ. 2.40 కోట్ల గరిష్ట మొత్తంలో అత్యధికంగా హైదరాబాద్‌ హంటర్స్‌ రూ. 2.39 కోట్లను ఖర్చు చేసింది. పీబీఎల్ ఈ ఏడాది డిసెంబర్ 22నుంచి వచ్చే జనవరి 14వరకు జరుగనుంది.

Story first published: Tuesday, October 10, 2017, 16:29 [IST]
Other articles published on Oct 10, 2017
Please Wait while comments are loading...
POLLS