కొరియా ఓపెన్ పీవీ సింధుదే: ఒకుహరాపై ప్రతీకారం తీర్చుకుంది

Posted By:

హైదరాబాద్: సియోల్‌ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ఘన విజయం సాధించింది. దీంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన ఒకుహరాపై నేడు సింధు ప్రతీకారం తీర్చుకుంది.

Sindhu Avenges Glasgow Loss To Clinch 3rd Super Series Title

దీంతో తొలిసారి కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది. కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరాపై 22-20, 11-21, 21-18తో సింధు విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచే ఒకుహరా దూకుడు ప్రదర్శించగా.. సింధు కూడా ఆమెకు దీటుగా బదులిచ్చి 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది.

తొలి సెట్‌లో ఆధిక్యం ప్రదర్శించిన సింధు, రెండో సెట్‌ను 11-21 తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధు, 21-18 తేడాతో తన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మూడో సెట్‌లో సింధు 18-16 తేడాతో ఆధిక్యంలో ఉన్న సమయంలో 56 షాట్ల ర్యాలీ జరగ్గా, కీలక పాయింట్ సింధు ఖాతాలో చేరి ఆమెకు 19వ పాయింట్‌ను అందించింది. ఆ తర్వాత సింధు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మూడు పాయింట్ల తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ ఒక గంటా 23 నిమిషాల పాటు సాగింది. మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధుకు అభినందనలు తెలిపింది. కాగా, ఇటీవలే గ్లాస్కో వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మంటన్ ఫైనల్ పోరులో ఒకహరా చేతిలో తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునట్లు అయింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహరా చేతిలో సింధు ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ ఫైనల్లో సింధు ఆఖరి పాయింట్ సాధించగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంబరాలను జరుపుకున్నారు. ఆమె గెలుపుపై భారత క్రీడాభిమానులు సైతం హర్షం వ్యక్తం చేశారు.

Story first published: Sunday, September 17, 2017, 12:45 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి