జకార్త: ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్లు ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్‌లు కూడా నిష్క్రమించారు. మాజీ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు, సాయి ప్రణీత్ బాటలోనే తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టారు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21-23, 10-21తో ప్రపంచ 41వ ర్యాంకర్‌బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇంతకుముందు లెవెర్‌దెజ్‌తో అయిందింటికి 5 మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ నెగ్గాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో షటిల్‌పై శ్రీకాంత్‌కు నియంత్రణ లభించలేదు.
అతడి అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి. మరోవైపు హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో ప్రణయ్ 21-10, 21-9తో 8వ సీడ్ లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్- ధ్రువ్ జోడీ 27-25, 18-21, 21-19తో మత్సుయ్- యొషినోరి (జపాన్) జంటపై గెలిచింది. ఒక గంటా 23 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీదే పైచేయి అయింది.
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ సింధు 14-21, 18-21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు క్రాస్ కోర్ట్ షాట్స్ ఆడటంలో ఇబ్బంది పడింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 16-21, 19-21తో హన్స్ క్రిస్టియన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.