'వారిద్దరి ఆట చూస్తుంటే ఆసక్తిగా అనిపించింది'

Posted By:
CWG 2018: Twitterati cheer Saina Nehwal’s gold and PV Sindhu’s silver medal

హైదరాబాద్: ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ క్రీడలనుంచి ఆటగాళ్లు తమ స్వదేశాలకు చేరుకున్నారు. దాదాపు అన్ని ప్రదేశాల్లో విజేతలుగా తిరిగొచ్చిన క్రీడాకారులకు ఘన స్వాగతాలు లభించాయి. ఈ సందర్భంగా సింధు, సైనాలనుద్దేశించి గోపీచంద్ మాట్లాడారు. బృంద స్ఫూర్తితో కామన్వెల్త్‌ క్రీడల్లో విజయం సాధించామని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పేర్కొన్నారు.

ఇంతటి విజయాన్ని ఊహించలేదన్నారు. ఇప్పుడు భారత్ బ్యాడ్మింటన్‌లో కేవలం ఇద్దరిపైనే ఆధారపడాల్సిన అవసర్లేదన్నాడు. గతంలో కంటే ఈసారి అందరూ మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు గేమ్‌ ఆసక్తిగా సాగిందని గుర్తుచేసుకున్నారు.

పతకాలను గెలుచుకున్న క్రీడాకారులు తమ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్‌ మాట్లాడుతూ.. మంచి జట్టులో భాగస్వామ్యమైనందుకు తానకెంతో సంతోషంగా ఉందన్నారు. డబుల్స్‌లో ఉత్తమ ఆటతీరు కనబర్చిన వారందరికీ అభినందనలు తెలిపారు. విశ్రాంతి లేకుండా కష్టపడ్డానని, ఏడాదిన్నర తర్వాత తాను సాధించిన తొలి పతకం ఇదేనన్నారు. రెండు వారాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడినట్టు చెప్పారు. రెండు స్వర్ణాలు సాధించిన బృందంలో తాను భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గోపీ చంద్‌ తమనెంతగానో ప్రోత్సహించారని, ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

కామన్వెల్త్‌లో ఇద్దరు భారతీయులు తుదిపోరులో తలపడటం గర్వకారణమని పీవీ సింధు అన్నారు. దేశానికి ఆడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గోపీచంద్‌ సూచించేవారని సింధు గుర్తుచేసుకున్నారు. ఆటలో ఎప్పుడూ ప్రత్యర్థులమేనని, సైనా కూడా అలాగే అనుకుందని అన్నారు. తుదిపోరులో ఎవరు ఒకరే గెలుస్తారని, తామిద్దరి మధ్య మాత్రం మంచి గేమ్‌ జరిగిందని తెలిపారు.

కామన్వెల్త్‌ ఆట వల్ల చాలా ఆనందంగా ఉన్నానని కిదాంబి శ్రీకాంత్‌ అన్నారు. ఏకధాటిగా పది రోజులు ఆడటం చాలా కష్టమని, మూడో గేమ్‌లో ఇంకా బాగా ఆడితే బాగుండేదని అన్నారు. తుదిపోరులో చేసిన పొరపాట్లను మళ్లీ పునరావృతం అవకుండా జాగ్రత్తపడతానని తెలిపాడు.

Story first published: Tuesday, April 17, 2018, 19:19 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి