సింధును ఓడించి స్వర్ణాన్ని గెలిచిన సైనా నెహ్వాల్

Posted By:
CWG 2018: Aggressive Saina clinches womens singles gold; Sindhu, Srikanth settle for silver

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణ యాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో రసవత్తర పోరు సాగింది. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ మధ్య ఫైనల్‌ పోరు హోరాహోరీగా ముగిసింది. 56నిమిషాల పాటు సాగిన పోరులో విజయం సైనా నెహ్వాల్‌నే వరించింది. రెండు వరుస గేమ్స్‌లో దూకుడుగా అడిన సైనా 21-18, 23-21తేడాతో సింధుపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది.

తొలి రౌండ్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన సైనా.. ఈ క్రమంలో తొలి గేమ్‌లో మొదటి నుంచే సింధుపై ఆధిక్యత సాధించింది. సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అదే జోరును కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తొలి గేమ్‌ను 21-18తేడాతో గెలుచుకుంది.

రెండో గేమ్‌లో ఒత్తిడి అధిగమించి సింధు దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. సైనా అనవసరపు తప్పిదాల మూలంగా సింధు రెండో గేమ్‌లో 19-16 ఆధిక్యతలోకి వచ్చింది. అయితే అనంతరం సైనా పుంజుకొని స్కోరు 19-19గా సమం చేసింది. అదే జోరు కొనసాగిస్తూ 23-21తేడాతో రెండో గేమ్‌ను కూడా గెలుచుకొని స్వర్ణం కైవసం చేసుకుంది.

దీంతో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, కామన్వెల్త్‌ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. ఇంతకుముందు 2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లోనూ సైనా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ గోల్డ్‌తో భారత్ ఖాతాలో 26 స్వర్ణాలు చేరగా... పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా టాప్‌లో, ఇంగ్లండ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

Story first published: Sunday, April 15, 2018, 11:50 [IST]
Other articles published on Apr 15, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి