వరల్డ్ నంబర్‌వన్: చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్

Posted By:
BWF rankings: Kidambi Srikanth confirmed No 1 in the world

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్‌వన్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రీకాంత్‌ రికార్డు సృష్టించాడు.

పురుషుల విభాగంలో చైనా ప్లేయ‌ర్లు డామినేట్ చేసే బ్యాడ్మింట‌న్‌లో ఓ భారత ష‌ట్ల‌ర్‌కు నెంబ‌ర్‌వ‌న్ ర్యాంక్ రావ‌డం నిజంగా గ‌ర్వ‌కార‌ణం. నిజానికి శ్రీకాంత్ గతేడాది అక్టోబర్‌లోనే నెంబర్ వన్ ర్యాంకుని అందుకోవాల్సి ఉంది. అయితే గాయం కారణంగా అందుకోలేకపోయాడు. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో శ్రీకాంత్ జోరుమీదున్నాడు.

చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్

చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్

ప్రస్తుతం గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో భారత్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్‌ 76,895 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 77,130 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్ ప్లేయ‌ర్‌ అలెక్సన్‌ 1,660 పాయింట్లు కోల్పోయి 75,470తో రెండో స్థానానికి పడిపోయాడు.కొరియాకి చెందిన సన్ వాన్ హో 74670 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. చైనా షట్లర్లు చెన్ లాంగ్, షియుకిలు వరుసగా 73466, 72743 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో లీ చాంగ్ వీపై శ్రీకాంత్ విజయం

కామన్వెల్త్ గేమ్స్‌లో లీ చాంగ్ వీపై శ్రీకాంత్ విజయం

కామన్వెల్త్ గేమ్స్‌లో మలేషియా టాప్ ప్లేయర్ లీ చాంగ్ వీపై శ్రీకాంత్ గెలవడం విశేషం. 52 వారాల వ్యవధిలో అత్యుత్తమ 10 టోర్నీల ప్రదర్శన ఆధారంగా బీడబ్ల్యూఎఫ్‌ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. గతేడాది కిదాంబి శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి నవంబరులో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

1980లో ప్రకాశ్‌ పదుకొణె నంబర్‌వన్‌గా

అంతేకాదు ఒక ఏడాదిలో నాలుగు సూపర్ సిరిస్ టైటిళ్లు నెగ్గిన నాలుగో షట్లర్. కంప్యూటరైజ్డ్‌ ర్యాంకింగ్‌ పద్ధతి లేనప్పుడు 1980లో ప్రకాశ్‌ పదుకొణె నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ఆ ఘనతను అందుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే.

ఏకైక ఇండియన్ మహిళా షట్లర్‌గా సైనా నెహ్వాల్

ఇప్పటికీ నంబర్‌వన్ అయిన ఏకైక ఇండియన్ మహిళా షట్లర్‌ రికార్డు సైనా పేరిటే ఉంది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీకాంత్ గతేడాదే నంబర్‌వన్ కావాల్సి ఉందని, గాయం కారణంగా కొన్ని టోర్నీలకు దూరమవడంతో ఆ ఛాన్స్ మిస్సయిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాడ్మింటన్ అనలిస్ట్ మక్దూమ్ అహ్మద్ చెప్పారు.

Story first published: Thursday, April 12, 2018, 15:28 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి