అసలేం జరిగింది?: బుమ్రాతో గొడవపడ్డ నైల్, చివరకు సారీ (వీడియో)

Posted By:

హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరిస్ అంటేనే మైదానంలో ఆటగాళ్లు దూకుడుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. తాజాగా మంగళవారం గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో బుమ్రా-కౌల్టర్‌ నైల్‌ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే?
బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ క్రీజులో ఉన్న సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ కౌల్టర్ నైల్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో నైల్‌ వేసిన చివరి బంతిని ఎదుర్కొన్న బుమ్రా పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నైల్‌, బుమ్రా ఒకరినొకరు ఢీకొన్నారు.

దీంతో నైల్ కాస్తంత అసహనానికి గురయ్యాడు. దీంతో బుమ్రాతో వాగ్వాదానికి దిగబోయాడు. అదే సమయంలో ఫీల్డ్ అంఫైర్ ఇద్దరి మధ్య కలగజేసుకుని సర్దిచెప్పడంతో నైల్, బుమ్రాకి సారీ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్ నిర్దేశించిన 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది.

Story first published: Wednesday, October 11, 2017, 16:32 [IST]
Other articles published on Oct 11, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి