'దేశం తరపున ఆడాలని అందరికీ ఉంటుంది'

Written By:
vijayshankar611

హైదరాబాద్; బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ విజయంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కీలకపాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్న అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు విజయ్‌.

ముక్కోణపు టోర్నీలో భాగంగా భారత్‌ సోమవారం లంకను ఢీకొట్టనుంది. ఈ టోర్నీలో లంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భవిష్యత్తు పర్యటనలను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ, పాండ్య, భువనేశ్వర్‌ తదితర ఆటగాళ్లకు ముక్కోణపు టోర్నీ నుంచి బీసీసీఐ ఉపశమనం కల్పించింది. దీంతో పలువురు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌ అనంతరం విజయ్‌ మాట్లాడుతూ..'ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. బౌలింగ్‌ నాకు అదనపు బలం. ఈ రోజు నాకు రెండు వికెట్లు దక్కాయి. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు పరుగులు చేయకుండా నియంత్రించగలిగాను. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ప్రతి ఆటగాడు దేశానికి ఆడాలని కలలు కంటుంటాడు. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లు ఎంతో మద్దతిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు విజయ్‌.

ఇంకా మాట్లాడుతూ.. 'మ్యాచ్ జరుగుతుండగా వదిలేసిన క్యాచ్‌లు నా ఆటపై ప్రభావం చూపలేదు. తొలి నుంచి మొదటి వికెట్ తీసేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. కానీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు తీయడం చాలా కష్టం. లైట్స్ కింద ఉండి ఫీల్డింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది' అని అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, March 9, 2018, 12:19 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి