
కేఎల్ రాహుల్
ప్రేయసి అతియా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. రంజీ ట్రోఫీలో ఇప్పుడే ఆడటం కష్టం. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిల్యాండ్ సిరీస్‌లో కూడా రాహుల్ ఆడటం లేదు. అయితే అతని రాష్ట్ర జట్టు కర్ణాటక ఇప్పటికే రంజీ ట్రోఫీ నాకౌట్స్ చేరింది. దీంతో ఆ జట్టు తొలి నాకౌట్ మ్యాచ్ ఈ నెల 31న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కనుక రాహుల్ ఆడితే.. కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ ముందు కొంత గేమ్ టైం దొరికినట్లు ఉంటుంది. మరి రాహుల్ ఈ మ్యాచ్ ఆడతాడా? లేక డైరెక్టుగా టీమిండియాకు ఓపెనింగ్ చేస్తాడా చూడాలి. అతను ఇటీవల అంత గొప్ప ఫామ్‌లో లేని సంగతి తెలిసిందే.

శ్రేయాస్ అయ్యర్
రాహుల్‌లాగే శ్రేయాస్ కూడా కివీస్ సిరీస్‌లో ఆడటం లేదు. అయితే అతను వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతను ముంబై తరఫున గ్రూప్ గేమ్ ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే ముంబై కనుక నాకౌట్స్‌కు చేరితే ఆ మ్యాచ్‌లో అయినా అయ్యర్ ఆడితే బెటర్. ఎందుకంటే ఇప్పటికే పంత్ లేకపోవడంతో టెస్టు క్రికెట్‌లో భారత మిడిలార్డర్ బలం సగానికి సగం పడిపోయినట్లే. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్‌లో శ్రేయాస్ బ్యాటింగ్ జట్టుకు చాలా కీలకంగా మారనుంది. అతను ఈ సిరీస్‌కు ముందే టచ్‌లోకి వస్తే బెటర్.

విరాట్ కోహ్లీ
వన్డేల్లో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ.. టెస్టు ఫార్మాట్‌లో పెద్దగా రాణించడం లేదు. బంగ్లాదేశ్ పర్యటనలో అతను చాలా ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతను మూడో వన్డే నుంచి తప్పుకొని అయినా సరే రంజీ ఆడాలని మాజీల సలహా. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ పాత్ర చాలా కీలకం. మిడిలార్డర్‌లో అనుభవజ్ఞుడైన కోహ్లీ.. ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అతను రంజీలో ఆడి.. మళ్లీ టెస్టు ఫార్మాట్ రుచి చూస్తే జట్టుకు చాలా మేలు జరుగుతుంది.

రవీంద్ర జడేజా
కచ్చితంగా రంజీలో ఆడుతున్న టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా. గతేడాది ఆగస్టు నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను.. తమిళనాడుతో జరిగే రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలో దిగుతున్నాడు. ఇప్పటికే చెన్నై చేరుకున్న జడ్డూ.. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్‌రౌండర్. అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసినా.. ఫిట్‌నెస్‌ను బట్టి అతన్ని జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది. అతను కనుక రంజీల్లో రాణిస్తే.. జడ్డూకే కాదు, టీమిండియాకు కూడా గొప్ప ఊరట లభించినట్లే.