పద్నాలుగేళ్ల క్రితం పాక్‌పై భారత్ భారీ విజయం

Posted By:
 SK Flashback: India win maiden ODI series on Pakistan soil in 2004

హైదరాబాద్: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఎంతో క్రేజ్. ఇప్పటికంటే పాత రోజుల్లో ఈ పోరుకు ఎక్కువ ఆసక్తి కనిపించేది. దాదాపు ఓ యుద్ధం జరుగుతుందేమో అన్నట్లు భావించేవారు క్రికెట్ అభిమానులు. ఈ రెండింటి మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఆ రోజు పనులు మొత్తం బంద్. అలా ఉండేది అప్పట్లో పరిస్థితి. ఇలానే పద్నాలుగేళ్ల క్రితం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడింది.

ఇరు జట్ల పోరు ఆసక్తికి తోడు 15 ఏళ్ల తరవాత పాకిస్థాన్ గడ్డపై భారత్ ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ అది. సాధారణంగానే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఐదు వన్డేల ఫ్రెండ్‌షిప్ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సరిగ్గా ఇదే రోజున అంటే మార్చి 13న కరాచీలో ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్‌మన్ చెలరేగిపోయారు.

 వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారం

వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారం

ముఖ్యంగా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 79 పరుగులు చేసి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (99) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ కైఫ్ (46), కెప్టెన్ సౌరవ్ గంగూలీ (45), సచిన్ టెండూల్కర్ (28) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారతే విజయపతాకం ఎగరేసి

భారతే విజయపతాకం ఎగరేసి

అంత పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ గెలిచినంత పనిచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడి భారత అభిమానులకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు భారతే విజయపతాకం ఎగరేసింది.

పాక్ కెప్టెన్ కదంతొక్కాడు

పాక్ కెప్టెన్ కదంతొక్కాడు

పాక్ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌ (122) కదంతొక్కాడు. ఇతనికి తోడు మహ్మద్ యూసఫ్ (73), యూనిస్ ఖాన్ (46), అబ్దుల్ రజాక్ (27), ఇమ్రాన్ ఫర్హాత్ (24) రాణించడంతో ఓ దశలో పాక్ గెలిచేలానే కనిపించింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరం కావడంతో అంతా పాక్‌దే విజయం అనుకున్నారు. అయితే ఆశిష్ నెహ్రా బంతితో మాయ చేశాడు.
0, 1, 0, 1, 1 గణాంకాలతో నెహ్రా ఐదు బంతులు పూర్తి చేశాడు.

 ఆఖరి బంతికి ఆరు పరుగులు

ఆఖరి బంతికి ఆరు పరుగులు

ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు కొట్టాలి. క్రీజులో మొయిన్ ఖాన్ ఉన్నాడు. ఒకటే ఉత్కంఠ. ఆఖరి బంతిని భారీ షాట్ ఆడబోయిన మొయిన్ లాంగ్ ఆన్‌లో జహీర్‌ఖాన్ చేతికి చిక్కాడు. అంతే భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అటు పాక్ ఆటగాళ్ల నోట మాటలేదు. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఈ సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది.

Story first published: Wednesday, March 14, 2018, 15:40 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి