తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ వైఫల్యం: ట్విట్టర్‌లో నెటిజన్ల జోకులు

Posted By:
Nidahas Trophy 2018, Match 1: Sri Lanka vs India – Best Memes and Gifs

హైదరాబాద్: ముక్కోణపు సిరిస్‌లో భాగంగా టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన రోహిత శర్మ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో కూడా దానిని కొనసాగిస్తున్నాడు.

కొలంబో వేదికగా మంగళవారం ఆతిథ్య శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయి అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే వికెట్‌ ఇచ్చేశాడు. శ్రీలంక బౌలర్ చమీరా విసిరిన బంతిని లాంగాఫ్‌ దిశగా గాల్లోకి లేపాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఫీల్డర్‌ మెండిస్‌ ఆ బంతిని అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా టీ20ల్లో ఐదుసార్లు డకౌట్ అయిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 75 టీ20లు ఆడిన రోహిత్‌ 68 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డకౌటయ్యాడు.

భారత్‌ తరఫున ఏ ఆటగాడు ఇన్నిసార్లు డకౌటైన దాఖలాలు లేవు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్ రికార్డును కూడా అధిగమించాడు. గతేడాది ఇదే శ్రీలంకపై సొంతగడ్డపై జరిగిన టీ20లో వేగవంతమైన శతకం సాధించి రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

అలాంటిది ఇప్పుడు డకౌట్‌గా వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు. దీంతో ట్విట్టర్‌లో రోహిత్ శర్మను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Story first published: Wednesday, March 7, 2018, 14:57 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి