కారణాలివే!: కోహ్లీసేనకు ఆర్నెళ్లుగా జీతాలు లేవు

Posted By:

హైదరాబాద్: టీమిండియా ఈ సీజన్‌లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఆడిన ప్ర‌తి టెస్టు సిరీస్‌నూ గెలుచుకుంది. 2016-17 సీజన్‌లో న్యూజిలాండ్‌ మొదలుకొని ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై టీమిండియా సిరీస్‌లు నెగ్గిన సంగతి తెలిసిందే.

టీమిండియా విజయ పరంపరను చూసిన బీసీసీఐ కోహ్లీ సేన‌కు న‌జ‌రానాలు కూడా ప్ర‌క‌టించింది. అయితే కోహ్లీ సేనకు ఈ మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ నుంచి అందాల్సిన మ్యాచ్‌ ఫీజు, బోనస్‌లు ఇంకా అందనట్లు సమాచారం. ఆదాయ పంపిణీలో ప్ర‌స్తుతం బీసీసీఐ, ఐసీసీల మధ్య నెలకొన్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Indian cricket team yet to get match fees for 6 months

నిజానికి టెస్టు ఆడిన తర్వాత 15 నుంచి నెల రోజుల్లో మ్యాచ్ ఫీజులు చెల్లిస్తారు. కానీ గత ఆరు నెలలుగా టీమిండియా ఆటగాళ్లకు పారితోషకాలు అందలేదని తెలుస్తోంది. కార‌ణ‌మేంటో తెలియ‌దని టీమిండియాలో రెగ్యుల‌ర్‌గా స్థానం సంపాదించే ఓ క్రికెట‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

'టెస్టు మ్యాచ్‌ ఆడిన అనంతరం 15 రోజుల్లోనో, నెలకో మాకు రావాల్సిన పారితోషకం వస్తుంది. అయితే ఈ సారి మరీ ఎక్కువ జాప్యం జరుగుతోంది. దీనికి గల కారణాలు మాత్రం తెలియదు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు' అని టీమిండియా జట్టు సభ్యుడు ఒకరు అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

కొత్త ప్లేయ‌ర్స్ కాంట్రాక్ట్ ప్ర‌కారం.. ఓ ప్లేయ‌ర్ టెస్టు మ్యాచ్ ఆడితే రూ.15 ల‌క్ష‌లు, వ‌న్డేకు రూ.6 ల‌క్ష‌లు, టీ20కి రూ.3 ల‌క్ష‌లు చెల్లించాలి. మరోవైపు భారత మహిళల జట్టు సభ్యులకు కూడా చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై గెలిచినందుకు బీసీసీఐ ప్ర‌క‌టించిన న‌జ‌రానాలు కూడా అందలేదు.

దీని కింద ఒక్కో ప్లేయ‌ర్‌కు రూ. కోటి అందాల్సి ఉంది. సుప్రీంకోర్టు నియ‌మించిన పాలనా వ్యవరహారాల క‌మిటీ (సీఓఏ) ప్ర‌స్తుతం బోర్డు ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్న‌ సంగతి తెలిసిందే. వాళ్ల అనుమ‌తి లేనిదే ఆటగాళ్లకు వేతనాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదు. ఇలా ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేకపోవడానికి చాలా కారణాలున్నాయని ఓ అధికారి తెలిపారు.

Story first published: Friday, April 28, 2017, 19:56 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి