5వ వన్డే: తుది జట్టులో మార్పులు తప్పవా, నెట్స్‌లో ధోని స్పిన్ బౌలింగ్ (వీడియో)

Posted By:
MS Dhoni

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు వన్డేల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న కోహ్లీసేనకు నాలుగో వన్డేలో సఫారీ జట్టు షాకిచ్చింది. వర్షం కారణంగా ఓవర్లను కుదించిన ఆ మ్యాచ్‌లో సఫారీ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో బోణి కొట్టింది. దీంతో అప్పటివరకు ఏకపక్షంగా సాగిన ఈ సిరిస్‌ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.

క్లాసన్ కొట్టిన షాట్.. మార్క్రమ్ పట్టిన క్యాచ్.. ఇవే ఇప్పుడు వైరల్

ఇక మిగిలింది రెండు వన్డేలే కావడంతో సిరీస్‌ని దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. సిరీస్‌ని సమం చేయాలని సఫారీలూ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి పోర్ట్‌ ఎలిజబెత్‌ సెయింట్ జార్జి పార్క్ స్టేడియం వేదికగా జరిగే ఐదో వన్డేపై ఆసక్తి నెలకొంది.

ఈ వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై సిరీస్‌ గెలిచిన భారత తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అలా జరగని పక్షంలో సిరిస్ ఫలితం ఆరో వన్డేకు మారుతుంది. దీంతో చివరి వన్డేలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. నాలుగో వన్డే ఓటమితో ఐదో వన్డేకి భారత్ జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.

ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మపై వేటు వేయాలని, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ... కెప్టెన్ కోహ్లీ మరో అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నాలుగో వన్డేలో విఫలమైన శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేసి.. అతని స్థానంలో మనీశ్ పాండే లేదా కేదార్ జాదవ్‌ని జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు నాలుగో వన్డేలో సఫారీ బ్యాట్స్‌మెన్ మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొనడంపై కూడా జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడింది. దీంతో సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్‌ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతనితో పాటు ధోని లెగ్ స్పిన్‌ని ప్రాక్టీస్ చేశారు. వీరిద్దరూ దినేశ్ కార్తీక్‌కి బౌలింగ్ చేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 19:22 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి