
జోష్ హేజిల్‌వుడ్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో తాజాగా జోష్ హేజిల్‌వుడ్ స్పందించాడు. హేజిల్‌వుడ్ మాట్లాడుతూ "భారత్ బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమంగా కనిపిస్తోంది. అయితే, విదేశీ పర్యటనల్లో కోహ్లీ మినహా అందరూ తేలిపోతున్నారు. 2014 ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటించింది. ఈ పర్యటనల్లో కోహ్లీ ఒక్కడే పరుగులు సాధించాడు" అని చెప్పుకొచ్చాడు.

కోహ్లీని ఔట్ చేయడంపైనే జట్టులో చర్చిస్తాం
"మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ భారీ స్కోర్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో తొలి టెస్టుకి ముందు.. కోహ్లీని ఔట్ చేయడంపైనే జట్టులో చర్చిస్తాం. కచ్చితంగా కనీసం రెండు వ్యూహాలతో బరిలోకి దిగుతాం" అని హేజిల్‌వుడ్ తెలిపాడు. చివరగా 2014లో ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడగా కోహ్లీ ఏకంగా 690 పైచిలుకు స్కోరు సాధించాడు.

గత పర్యటనలో కోహ్లీ మెరుగైన రికార్డు
ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న అడిలైడ్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ సగటుకు దాదాపు సమానంగా అడిలైడ్‌లో కోహ్లి యావరేజ్ ఉండటం విశేషం. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 98.50 సగటుతో 394 పరుగులు చేశాడు.

బలహీనంగా కనిపిస్తోన్న ఆస్ట్రేలియా
ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. స్మిత్, వార్నర్ లాంటి ఆటగాళ్లు లేకపోవడం, మిగతా ఆటగాళ్లు కూడా పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా ఉంది. అడిలైడ్‌లో కోహ్లీకి అద్భుతమైన బ్యాటింగ్ రికార్డు ఉండటం ఆస్ట్రేలియాను కలవపాటుకు గురి చేస్తోంది. 2012లో ఒత్తిడి మధ్య అడిలైడ్ టెస్టులో బరిలో దిగిన విరాట్ కోహ్లీ ఆసీస్ పేసర్లను ఎదుర్కొని 116 పరుగులు చేశాడు.