పరస్పర విరుద్ధ ప్రయోజనాలు: మరోసారి తెరపైకి రాహుల్ ద్రవిడ్ పేరు

Posted By:
Rahul Dravid

హైదరాబాద్: రాహుల్ ద్రవిడ్ నిజాయితీకి మారుపేరు. భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్లలో ఒకడు. అయితే 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల' అంశం కారణంగా తాను మరోసారి వివాదంలోకి రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా భారత అండర్-19, ఇండియా ఏ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ స్పందించాడు.

గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ మెంటార్‌గా వ్యవహరిస్తూ టీమిండియా-ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా కొనసాగడంపై పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ ద్రవిడ్ ఢిల్లీ జట్టు మెంటార్ పదవి నుంచి తప్పుకున్నాడు.

తాజాగా బెంగళూరులో కొత్తగా నిర్మించిన పదుకొణే-ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌పై 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల' అంశం రాకూడదనే రాహుల్ ద్రవిడ్ బోర్డుకు ఓ లేఖలో వివరణ ఇచ్చాడు. ఈ అకాడమీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని స్వచ్ఛందంగా బోర్డుకు అందచేశాడు.

కొత్తగా ప్రారంభమైన అకాడమీకి కేవలం నా పేరు మాత్రమే ఉంటుందని, సంస్థలో తాను ఏవిధంగానూ భాగస్వామ్యం కాలేదని, ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే వాటితో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

'ఈ విషయంలో ద్రవిడ్‌కు ఎలాంటి సమస్యలేదు. ఏదైనా తుది నిర్ణయానికి రాకముందే చట్టపరమైన వివరణ ఇవ్వడం ఎల్లప్పుడూ మంచిదే. ఒకసారి అంబుడ్స్‌మన్‌ను నియమించిన తరువాత ఈ అంశం అతనికి తెలియజేయబడుతుంది' అని ఆ అధికారి వెల్లడించారు.

అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనడానికి న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా యువ జట్టు బయలుదేరడానికి ముందే అతడు బీసీసీఐకి లేఖ రాశాడు. బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ఆరు విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్, స్వాష్, ఫుట్‌బాల్, స్మిమ్మింగ్‌లో శిక్షణ అందిస్తున్నారు.

Story first published: Friday, March 9, 2018, 14:28 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి