
దేశ ప్రజలకు బోర్డు జవాబుదారీగా
దీంతో దేశ ప్రజలకు బోర్డు జవాబుదారీగా ఉంటూ ఆర్టీఐ చట్టం సెక్షన్ 2(హెచ్) ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. "దేశంలో క్రికెట్ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఉన్న ఆమోదిత జాతీయ స్థాయి సంఘంగా బీసీసీఐని ఇదివరకే సుప్రీం కోర్టు పేర్కొంది. ఇక బోర్డు ఆర్టీఐ పరిధిలో ఉండే విధంగా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)ల్లో ఒకటిగా లిస్ట్ కావాల్సి ఉంటుంది" అని తన 37 పేజీల సుదీర్ఘ తీర్పులో సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు.

15 రోజుల్లోగా
దీంతోపాటు 15 రోజుల్లోగా ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, సీఓఏలకు ఆదేశాలు జారీ చేశారు. బీసీసీఐ ఏ మార్గదర్శకాల కింద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందో, భారత్‌కు ఆడే ఆటగాళ్లను ఎంపిక చేస్తోందో తెలపాలంటూ గీతారాణి అనే మహిళ చేసిన దరఖాస్తుతోనే ఇదంతా జరిగింది.

దేశం తరఫున జట్టును ఎలా పంపిస్తోంది?
బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అయితే అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున జట్టును ఎలా పంపిస్తోంది? భారత్ పేరును వాడుకునే అధికారం కేంద్రం ఎలా ఇచ్చిందని ప్రశ్నించింది. దీనికి తమ దగ్గర ఎలాంటి సమాధానం లేదని, బీసీసీఐ.. ఆర్టీఐ పరిధిలో లేదని క్రీడా శాఖ ఆమెకు సమాధానమిచ్చింది. దీంతో గీతా రాణి సీఈసీని సంప్రదించింది.

బీసీసీఐని గతంలోనే వివరణ కోరిన సీఐసీ
దీంతో ఈ విషయంలో సమాధానం ఇవ్వాల్సిందిగా బీసీసీఐని గతంలోనే సీఐసీ కోరింది. అసాధారణ అధికారాలు ఉన్న బీసీసీఐ పనితీరు వల్ల ఆటగాళ్ల మానవ హక్కులకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని... ఇలాంటి అంశాలపై ఇన్నేళ్లుగా బోర్డును బాధ్యులుగా చేయాల్సి ఉన్నా సరైన నిబంధనలు లేక ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదని కూడా శ్రీధర్ ఆచార్యులు అభిప్రాయ పడ్డారు. దీంతోపాటు అప్పీలుదారు అడిగిన వివరాలను పదిరోజుల్లోగా పాయింట్ల వారీగా అందించాలని బోర్డుని ఆదేశించారు.