సౌతాంప్టన్: భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నోబాల్ బలహీనతని పునరావృతం చేయడంతో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పెదవి విరిచాడు. ఇంగ్లాండ్‌తో గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా విసిరిన నోబాల్ కారణంగా కెప్టెన్ జో రూట్‌కి లైఫ్ లైన్ దక్కింది. అతను చేసిన పనికి అందరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. అయితే.. బుమ్రా అదృష్టం మేరకు తర్వాత కొద్దిసేపటికే జోరూట్‌ని ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. దీంతో భారత్ జట్టు ఊపిరి పీల్చుకుంది.
లేకుంటే.. ఆ నోబాల్ కారణంగా టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చేది. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్లో బుమ్రా విసిరిన నోబాల్ కారణంగా.. లభించిన జీవనదానంతో చెలరేగిన ఓపెనర్ ఫకార్ జమాన్ సెంచరీతో భారత్‌కి మ్యాచ్‌ను దూరం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనే కాదు.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ బుమ్రా ఇలానే నోబాల్ తప్పిదంతో భారత్‌కి మ్యాచ్‌ను దూరం చేశాడు.
వీలైనంత త్వరగా బుమ్రా ఈ నోబాల్ బలహీనతని సరిదిద్దుకోకపోతే.. వ్యక్తిగతంగా అతనే కాదు.. టీమ్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గవాస్కర్ హెచ్చరించాడు. 'జస్ప్రీత్ బుమ్రా నోబాల్ విసరకుండా ఉండేందుకు నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేయాలి. అతను ఇలానే తీరు మార్చుకోకుండా నోబాల్స్ విసిరితే వ్యక్తిగతంగా తనకు తానే నష్టపోవడమే కాకుండా.. జట్టు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.'
'మ్యాచ్‌లో బౌలర్ నోబాల్ కారణంగా.. జట్టుకి దక్కిన వికెట్ చేజారడం ఆటగాళ్లనూ బాధిస్తుంది. ఓవర్‌లో ఓ అదనపు బంతిని వేయాల్సి రావడం బౌలర్‌కి కూడా భారమే. కాబట్టి వీలైనంత త్వరగా బుమ్రా ఆ నోబాల్ బలహీనతని సరిదిద్దుకోవాలి' అని గవాస్కర్ సూచించాడు. ఓవర్ నైట్ స్కోరు19/0తో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా క్రీజులో శిఖర్ ధావన్ (3 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (11 బ్యాటింగ్)లతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. భారత్ జట్టు ఇంకా 227 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది.