హైదరాబాద్: బీసీసీఐలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే 90 రోజుల్లో బీసీసీఐ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ సోమవారం తెలిపాడు. సోమవారం ఓ కార్యక్రమంలో వినోద్ రాయ్ మాట్లాడుతూ "వచ్చే 90 రోజుల్లో బీసీసీఐకి ఎన్నికలు నిర్వహిస్తాం" అని అన్నాడు.
"అది మాకు మేము పెట్టుకున్న గడువు. బీసీసీఐ కొత్త సర్వసభ్య కమిటీ నియామకం కాగానే సీఓఏ తన బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. బీసీసీఐ వ్యవహారంలో పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా వ్యవహరించేందుకు మేం ప్రయత్నించాం'' అని వినోద్ రాయ్ తెలిపాడు.
ఈ సందర్భంగా వన్ టైమ్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు, దేశవాళీ క్రికెటర్ల జీతాల పెంపుపై కూడా చర్చించారు. తాజాగా, వినోద్ రాయ్ ప్రకటనను బట్టి చూస్తే బీసీసీఐకి నవంబర్ చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
"అనిల్ కుంబ్లే ఏడాది కాలం కోసమే నియమితుడయ్యాడు. ఆ తర్వాత కొత్త ప్రక్రియను ప్రారంభించాం. టెస్టు క్రికెట్ సలహా కమిటీ ఆ ప్రక్రియలో భాగంగానే పనిచేసింది" అని వినోద్ రాయ్ పేర్కొన్నాడు.