హైదరాబాద్: 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపధ్యంలో 'సంపర్క్ సే సమర్థన్' ప్రచారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోరుగా సాగిస్తున్నారు. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ఆయన పలువురు ప్రముఖులను కలుస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలుసుకున్నారు. ధోనిని ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కలిసిన అమిత్ షా.... ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివరించి.. ప్రజల్లోకి ఎలా తీసుకువెళుతుంది వివరించారు.
ఈ సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్‌లో "'దేశవ్యాప్తంగా ప్రముఖలతో ములాఖత్‌లో భాగంగా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరైన ధోనిని కలిశాను. గత నాలుగేండ్లుగా మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక పనుల్ని ఆయనకు వివరించాను" అని పేర్కొన్నారు.
అమిత్ షా వెంట కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌గోయల్, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమిత్ షా దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి మద్దతు కోరుతున్నారు.
As part of "Sampark for Samarthan" initiative, met @msdhoni, one of the greatest finishers in world cricket. Shared with him several transformative initiatives and unprecedented work done by PM @narendramodi's govt in the last 4 years. pic.twitter.com/dpFnPWTwWn
— Amit Shah (@AmitShah) August 5, 2018
కాగా ఇప్పటికే అమిత్ షా ఇప్పటికే గాయని లతా మంగేష్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఫిల్మ్ స్టార్ మాధురీ దీక్షిత్, ఆర్మీ మాజీ అధ్యక్షుడు జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సీ లహోటి, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్‌లను కలిసారు.