సైనా చేతిలో ఓటమి: ఫేస్‌బుక్‌లో పీవీ సింధు భావోద్వేగపూరిత లేఖ

Posted By:
PV Sindhu Writes Emotional Letter After Loss to Saina Nehwal in CWG Final

హైదరాబాద్: గత ఆదివారంతో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కామన్వెల్త్ క్రీడలు ముగిసిన అనంతరం పీవీ సింధు సోమవారం స్వదేశానికి తిరిగి రాగానే అభిమానులకు ఓ భావోద్వేగపూరిత లేఖ రాసింది.

ఇలాంటి ఓటములు తనను అడ్డుకోలేవని, మళ్లీ పుంజుకుంటానని సింధు అందులో స్పష్టం చేసింది. 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుకల్లో భారత పతకాన్ని చేతబట్టి భారత బృందానికి మార్గదర్శకత్వం వహించిన పీవీ సింధు.. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో 21-18, 23-21తో తేడాతో సైనా చేతిలో ఓటమిపాలైంది.

'మరో ఓటమి.. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఈ గేమ్ కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. మరో ఫైట్‌లో గెలిచేందుకు నేను సిద్ధం. ఇది నా ప్రయాణం. ప్రతి క్రీడకారుడి ప్రయాణమిదే. ప్రతి విజయం తర్వాత మరో లక్ష్యాన్ని జీరో నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది' అని అందులో పేర్కొంది.

'పోడియంపై నిలబడి సిల్వర్ మెడల్ అందుకుంటున్నపుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగింది. నేను పడిన కష్టం, చెమటోడ్చిన వైనం నా కళ్ల ముందు కదలాడాయి. నా వరకు మన జాతీయగీతం వినిపించినప్పుడే విజయం మొదలవుతుంది' అని సింధు వెల్లడించింది.

'కామన్వెల్త్ గేమ్స్‌లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ముందు నడుస్తున్నపుడు కోట్ల మంది అభిమానుల ఆశలను మోస్తున్నట్లు అనిపించింది. చివరిగా చెమటోడ్చడం నేర్చుకున్నపుడు గెలుపు అలవాటుగా మారుతుంది' అని పీవీ సింధు తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసింది.

గోల్డ్‌ కోస్ట్‌లో వేదికగా 12 రోజులపాటు జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 66 పతకాలతో మూడో స్ధానంలో నిలిచింది. మొత్తం 12 రోజుల పాటు జరిగిన ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ 26 స్వర్ణాలు, 20 రజత పతకాలు, 20 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. మానికా బత్రా నాలుగు పతకాలతో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచింది.

Story first published: Tuesday, April 17, 2018, 16:17 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి