ఆ ఐదుగురిపైనే: ఫిట్ నెస్ సాధిస్తానన్న సింధు.. 4 నుంచి కామన్వెల్త్ గేమ్స్

Posted By:
Commonwealth Games 2018: PV Sindhu hopes to regain peak fitness in time to lead Indias medal rush at Gold Coast

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి మరో 48 గంటల గడువు మాత్రమే ఉంది. ఈ క్రీడల్లో పతకం సాధించడం ప్రతి ఒక్కరి కల. ఒలింపిక్స్‌ను తలపిస్తూ ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్‌లో పతకం కోసం పక్కా ప్రణాళికను ఎంచుకుంటారు. ప్రత్యర్థులను పడగొడుతూ పతకం దక్కించుకునే ఆ అద్భుత క్షణం కోసం క్రీడాకారులు రోజుల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు.

దేశం తరఫున పతకం సాధించడమనేది అనిర్వచనీయమైన అనుభూతి. అది మాటల కందని సందర్భం. కానీ దీని వెనుక మనకు తెలియని కష్టాలు, నష్టాలు ఎన్నో దాగుంటాయి. వీటిని పంటి బిగువున భరిస్తూ పతకం సాధనే లక్ష్యంగా బరిలోకి దిగుతుంటారు.

అలా వీరు పోటీకి దిగితే పతకం పక్కా అనే వాళ్లలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, శ్రీకాంత్‌తో పాటు రెజ్లర్ సాక్షి మాలిక్, ఏస్ షూటర్ జీతురాయ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే తమ క్రీడా విభాగాల్లో తమదైన ముద్ర వేసిన వీరు బుధవారం నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్‌లో కచ్చితంగా పతకం సాధిస్తారన్న నమ్మకముంది.

 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్‌లో పతకాలు పక్కా ఇలా

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్‌లో పతకాలు పక్కా ఇలా

కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత పోటీలు ప్రారంభమయ్యే నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని పీవీ సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ గేమ్స్‌లో భారత్ చాలా పతకాలు గెలుస్తుందని చెప్పింది. గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో సింధు కుడి కాలి చీలమండ బెణికింది. దీంతో వెంటనే స్కానింగ్ తీయించగా ఎముక, లిగ్‌మెంట్‌కు ఎలాంటి గాయం కాలేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘గేమ్స్ సన్నాహకాలు చాలా బాగా సాగుతున్నాయి. దురదృష్టవశాత్తు కాలు బెణికింది. అయినప్పటికి గేమ్స్ వరకు పూర్తిగా కోలుకుంటా, నాలుగేళ్ల కిందట నేను కాంస్యం గెలిచా. ఈసారి దాని రంగు మార్చాలి. ఇందుకోసం శక్తివంచన లేకుండా కష్టపడుతా. కచ్చితమైన సంఖ్య చెప్పలేకపోయినా.. ఈసారి చాలా పతకాలు వస్తాయి' అని సింధు పేర్కొంది. దేశంలో టాప్ ప్లేయర్‌గా ఉండటం వల్ల ఈసారి తమపై భారీ అంచనాలు ఉన్నాయని వెల్లడించింది. గోల్డ్‌కోస్ట్‌లో వీటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నదన్నది. ‘పెద్ద టోర్నీలో ఆడుతున్నప్పుడు ఫిట్‌గా ఉండటం చాలా ప్రధానం. ఫలితంతో సంబంధం లేకుండా మన సత్తా మేరకు రాణించాలి. మేం పతకాలు గెలువాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు'అని సింధు వ్యాఖ్యానించింది.

కష్టపడిన ఎదిగిన అత్యుత్తమ షట్లర్ శ్రీకాంత్

కష్టపడిన ఎదిగిన అత్యుత్తమ షట్లర్ శ్రీకాంత్

భారత బ్యాడ్మింటన్ మరో తురుపుముక్క కిడాంబి శ్రీకాంత్. అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారుడు. కష్టాన్ని నమ్ముకుంటూ ప్రపంచ అత్యుత్తమ షట్లర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. యువ షట్లర్లకు స్ఫూర్తిగా గెలుపే ఆలంభనగా మలుచుకున్న శ్రీకాంత్‌ను కామన్వెల్త్ పతకం ఊరిస్తున్నది. నాలుగేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో అరంగేట్రం చేసిన ఈ తెలుగు షట్లర్‌కు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్‌లోనే ప్రత్యర్థి చేతిలో ఓడి నిష్క్రమించాడు. అప్పటికి ఇప్పటికి అతని ఆటతీరులో చాలా తేడా వచ్చింది. ఆటలో చిరుతను తలపించే వేగంతో పాటు ఫిట్‌నెస్, టెక్నిక్ ఇలా అన్నింటిలో మెరుగయ్యాడు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల్ల గోపీచంద్ శిష్యరికంలో రాటుదేలాడు. గతేడాది ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలువడమే దీనికి నిదర్శనం. దాదాపు పోటీపడ్డ ప్రతి టోర్నీలోనూ తన దైన ఆటతీరుతో అదురగొట్టాడు. వచ్చే కామన్వెల్త్‌లో చైనా, కొరియా, ఇండోనేసియా, నెదర్లాండ్స్ దేశాల ఆటగాళ్లు పోటీలో లేకపోవడం శ్రీకాంత్‌కు కలిసొచ్చే అంశం కానుంది.

 2015లో అర్జున అవార్డుతో జీతూరాయ్

2015లో అర్జున అవార్డుతో జీతూరాయ్

భారత షూటింగ్‌కు కెప్టెన్ జీతురాయ్. గురిచూసి కొట్టాడంటే పతకం రావాల్సిందే. అలా మనోడి గురికి ఇప్పటికే పతకాల పంట పండింది. నాలుగేళ్ల క్రితం గ్లాస్కోలో బరిలోకి దిగిన తొలి కామన్వెల్త్‌లోనే రికార్డులతో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టాడు. అక్కడితో ఆగకుండా అదే ఏడాది మారిబార్‌లో జరిగిన షూటింగ్ ప్రపంచకప్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రెండు పతకాలు(స్వర్ణం, రజతం) నెగ్గిన తొలి భారత షూటర్‌గా నిలిచాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్యం దక్కించుకున్నాడు. జీతు ప్రతిభను గుర్తించిన కేంద్ర క్రీడాశాఖ 2015లో అర్జున అవార్డుతో సత్కరించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచినా.. ఆ తర్వాత మెరుగైన ప్రదర్శనతో జీతు చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ టైటిల్‌ను దక్కించుకుని ఔరా అనిపించాడు. ఇలా ప్రతి మేజర్ టోర్నీలోనూ కచ్చితంగా పతకం గెలుస్తున్న జీతురాయ్ రానున్న కామన్వెల్త్‌లోనూ అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. జీతు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పతకాల పంట పండినట్లే.

తొలిసారి గ్లాస్కో కామన్వెల్త్‌లో రజతం

తొలిసారి గ్లాస్కో కామన్వెల్త్‌లో రజతం

భారత రెజ్లింగ్ ఆశాకిరణం సాక్షి మాలిక్. హర్యానా క్రీడాకారిణి అయిన సాక్షి మాలిక్ కోట్ల మంది యువతకు ఆదర్శంగా నిలిచిన వైనం స్ఫూర్తిదాయకం. వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లింగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సాక్షిపై ఆశలు భారీగానే ఉన్నాయి. గ్లాస్కో కామన్వెల్త్‌లో పోటీకి దిగిన తొలిసారే రజత పతకాన్ని ఒడిసి పట్టిన మాలిక్ పసిడి పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. 2014 కామన్వెల్త్ నుంచి ఇప్పటి వరకు పోటీకి దిగిన ప్రతి టోర్నీలోనూ సాక్షి సత్తాచాటింది. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ పతకాలను ఒడిసి పట్టుకుంది. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. పతక ఆశలు అడుగంటిన వేళ తాను ఉన్నానని మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన వైనం ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూనే ఉన్నది. ఇదే జోరులో కామన్వెల్త్‌లోనూ సాక్షి పసిడి పట్టుపట్టాలని కోట్ల మంది బారతీయులు ఆశిస్తున్నారు.

 2016 జూనియర్ ప్రపంచ కప్‌లో తొలి పతకం

2016 జూనియర్ ప్రపంచ కప్‌లో తొలి పతకం

భారత అథ్లెటిక్స్ ఆశాకిరణం నీరజ్ చోప్రా. పిట్టకొంచెం కూత ఘనం అన్న రీతిలో దేశ అథ్లెటిక్స్‌కు చుక్కానిలా కనిపిస్తున్నాడు. ఈ రోజు వరకు భారత్‌కు దొరికిన అత్యుత్తమ అథ్లెట్లలో నీరజ్ ఒకడని మాజీ లాంగ్‌జంపర్ అంజుబాబీ జార్జ్ ప్రశంసలు పొందిన ఆటగాడు. 2016లో జూనియర్ ప్రపంచకప్‌లో జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డుతో భారత్‌కు తొలి పతకం అందించి అరుదైన రికార్డుతో నీరజ్ వెలుగులోకి వచ్చాడు. అక్కణ్నుంచి వెనుదిరిగి చూడ లేదు. పోటీ ఏదైనా పతకమే లక్ష్యంగా ఈ యువ జావెలిన్ త్రోయర్ విజృంభిస్తున్నాడు. కామన్వెల్త్ కోసం జర్మనీలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్న నీరజ్..కామన్వెల్త్‌లో సత్తాచాటాలన్న కసితో ఉన్నాడు. సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 85.94మీటర్లతో కామన్వెల్త్‌కు అర్హత సాధించిన నీరజ్ పతకం సాధిస్తాడన్న నమ్మకముంది.

Story first published: Monday, April 2, 2018, 10:53 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి