'పూర్తి స్థాయి కెప్టెన్‌గా కోహ్లీ ఇంకా పరీక్షించబడలేదు'

Posted By:
Virat Kohli still has a lot to prove as India captain, says Bishan Singh Bedi

హైదరాబాద్: పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిరూపించుకోవాల్సింది ఇంకా ఉందని టీమిండియా మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ స్పష్టం చేశారు. తాజాగా బేడీ ఫస్ట్ ఫోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో "నిజాయితీగా చెబుతున్నా. బ్యాట్స్‌మెన్‌గా భారత జట్టుని అద్భుతంగా నడిపిస్తున్నాడు. జట్టు కూడా అద్భుత ఫలితాలను సాధిస్తోంది" అని అన్నాడు.

"కెప్టెన్‌గా కోహ్లీ ఇంకా కఠిన పరీక్షను ఎదుర్కొలేదు. కెప్టెన్సీ విషయానికి వస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ బ్రియార్లీ గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే వారు గేమ్ గురించి ఆలోచించారు కాబట్టి. ఆ స్థాయికి ఇంకా కోహ్లీ చేరుకోలేదు. అతను ఇంకా పరీక్షించబడలేదు" అని పేర్కొన్నాడు.

"కోహ్లీ నిలకడగా రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆట పట్ల అతడికి ఉన్న నిబద్ధత అద్భుతం. ఇంగ్లాండ్ పర్యటన కోహ్లీకి ఓ పరీక్ష లాంటింది. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ఐదు టెస్టు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టులు మ్యాచ్‌లు జరుగుతాయి. వీటికి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలాగో ఉండనుంది" అని బేడీ పేర్కొన్నాడు.

కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటికే అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 2005-2008 మధ్య కాలంలో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డుని సైతం కోహ్లీసేన సమం చేసింది.

ఇక సఫారీ గడ్డపై ఏ కెప్టెన్ కూడా సాధించలేని ఘన విజయాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా నమోదు చేసింది. ఇటీవల సఫారీ గడ్డపై టీమిండియా వరుసగా రెండు సిరిస్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ ఏడాది కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ ముగిసిన తర్వాత ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. గత పదేళ్లలో ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా విజయం సాధించలేదు. 2007లో చివరిసారిగా విజయం సాధించింది.

Story first published: Thursday, March 8, 2018, 16:53 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి