చాన్నాళ్ల తర్వాత ధోని... ధోని అని హోరెత్తిన చిదంబరం స్టేడియం (వీడియో)

Posted By:

హైదరాబాద్: 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. అయితే స్టేడియంలోని అభిమానులకు అవేమీ పట్టలేదు. రోహిత్ శర్మ (28) పరుగుల వద్ద అవుటైన తర్వాత ధోని క్రీజులోకి వస్తుంటే స్టేడియమంతా హోరెత్తిపోయింది.

కీలక వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి అడుగుపెడుతుంటే మాత్రం అభిమానులు ధోని.. ధోని... అని అరుస్తూ చిదంబరం స్టేడియాన్ని హోరెత్తించారు. ధోని మైదానంలోకి అడుగుపెడుతుంటే ఫ్యాన్స్ మురిసిపోయారు.

ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఇదే చెపాక్ స్టేడియంలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడిన ధోని, చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

'ద కింగ్ రిటర్న్స్ టు చెన్నై' అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత రెండు సీజన్ల నుంచి నిషేధం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఆడని సంగతి తెలిసిందే. అంతేకాదు 1987లో రిలయన్స్‌ కప్‌ అనంతరం మరోసారి ఇరు జట్లు ఇక్కడ తలపడటం ఇదే తొలిసారి కావడంతో ధోని ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి వచ్చారు.

Story first published: Sunday, September 17, 2017, 16:43 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి