టీ20 ఫార్మాట్‌లో షార్ట్ బాల్స్ ఆడలేక తడబడి విమర్శలపాలైన శ్రేయాస్ అయ్యర్.. వన్డే ఫార్మాట్‌లో మరోసారి సత్తా చాటాడు. న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, శిఖర్ ధవన్ వెంట వెంటనే అవుట్ అవడంతో టీమిండియాపై ఒత్తిడి పడింది. ఇలాంటి సమయంలో కుదురుగా ఆడిన శ్రేయాస్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిలబెట్టాడు.
సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్‌లతో అరుదైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకానొక దశలో భారత జట్టు 250 పరుగులు మాత్రమే చేస్తుందని అనిపించింది. అయితే అయ్యర్ అద్భుతమైన పోరాటంతోపాటు వాషింగ్టన్ సుందర్ మెరుపులతో టీమిండియా స్కోరు 300 మార్కు దాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ నిరాశ పరిచాడు. న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టీ20లో కూడా సూర్య భారీ స్కోరు చేయలేకపోయాడు.
ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న అభిమానులు.. సూర్య ఏదో తొందరలో ఉన్నట్లు ఆడుతున్నాడని అంటున్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌లో సూర్య కన్నా శ్రేయాస్ చాలా బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో జట్టులో స్థానమే లక్ష్యంగా శ్రేయాస్ కష్టపడుున్నాడంటూ మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది టీ20ల్లో పెద్దగా రాణించకపోయినా వన్డే ఫార్మాట్‌లో మాత్రం శ్రేయాస్ అదరగొడుతున్నాడు.
ఈ ఏడాదిలో ఆడిన 11 మ్యాచుల్లో 566 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌లో శ్రేయాస్ చివరి ఐదు స్కోర్లు వరుసగా 63, 44, 50, 113 నాటౌట్, 80. ఈ లెక్కన వన్డే వరల్డ్ కప్ కోసం శ్రేయాస్‌ను ఎంపిక చేయకపోతే భారత జట్టుకు చాలా నష్టం అని అభిమానులు అంటున్నారు. మరి కోహ్లీ, రాహుల్, రోహిత్ తిరిగొచ్చిన తర్వాత జట్టులో అయ్యర్‌ను కొనసాగిస్తారా? లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా? అని చూడాలి.