ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన హ్యారీ బ్రూక్.. రెహాన్ స్థానంలో జెమీ ఓవర్టన్ జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. వికెట్ చూడటానికి బాగుంది. బంతితో మంచి ఆరంభం దక్కుతుందని ఆశిస్తున్నాం. ఈ మైదానంలో మా కంటే భారత్‌కు ఎక్కువ అనుభవం ఉంది. టీ20 క్రికెట్ అనేది చాలా అస్థిరమైన ఆట. ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేం. భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలమని ఆశిస్తున్నాం. రెహాన్ స్థానంలో ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చాడు.'అని హ్యారీ బ్రూక్ టాస్ సందర్భంగా తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తాము టాస్ ఓడినా కోరుకున్నదే లభించినందుకు సంతోషంగా ఉందన్నాడు. 'మేము టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. సెమీఫైనల్, పెద్ద మ్యాచ్, పైగా గాలి కూడా ఎక్కువగా ఉంది.
మంచు ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నాను. పిచ్ చూడటానికి చాలా బాగుంది. బహుశా ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అత్యుత్తమమైనదని అనుకుంటున్నా. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు అభినందనలు. మేం తుది జట్టులో మార్పులు చేయకుండా మా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.