న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

Yashasvi Jaiswal’s journey, From selling paani-puri to smashing a ton against Pakistan

హైదరాబాద్: సరిగ్గా ఐదునెలల క్రితం (2019 అక్టోబర్ 16) భారత క్రికెట్‌లోకి ఓ టీనేజీ సంచలనం దూసుకొచ్చింది. అప్పటి‌కే అతను పరుగుల వరద పారించినా క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది మాత్రం ఆ క్షణమే. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ముంబై మైదానాల నుంచి వచ్చిన ఆ కుర్రాడు కొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు. దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టీనేజ్ సెన్సేషన్.. ఆ సంచలన రికార్డు హీరో ఎవరో కాదు.. నిన్న అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుత సిక్స్‌తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను పాతరపెట్టిన యశస్వి జైస్వాల్. భారత్‌కు 10 వికెట్ల విజయాన్నందించి ఫైనల్‌కు చేర్చిన సెంచరీ హీరో. అంతేకాకుండా ఈ టోర్నీలో 5ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 312 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన బ్యాట్స్‌మన్.

 యశస్వి.. క్రికెట్ తపస్వి..

యశస్వి.. క్రికెట్ తపస్వి..

ఉండటానికి వసతి లేదు.. తినడానికి తిండి లేదు.. ఆకలితో అలమటిస్తున్నా గుప్పెడు మెతుకులు దొరకని స్థితి. అయినా క్రికెటర్‌ కావాలనే అతడి సంకల్పం ముందు అవన్నీ బలాదూర్‌ అన్నాయి. ఆటతోనే ఆకలిని జయించాడు.. పరుగులతోనే దాహాన్ని తీర్చుకుంటున్నాడు. కష్టాల కొలిమిలో కాలినా.. పరిస్థితులు పరీక్షించినా.. ఆత్మస్ఠైర్యంతో వాటిని ఎదురించి.. ఆటే ఆశగా, శ్వాసగా.. క్రికెట్‌ తపస్విగా మారాడు యూపీ కుర్రాడు యశస్వి.

India vs Pakistan: ఇట్స్ సో క్యూట్.. ఇట్స్ సో నైస్.. ఇట్స్ సో సూపర్ రనౌట్!!

డెయిరీ దుకాణంలో పని..

డెయిరీ దుకాణంలో పని..

11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్‌ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్‌)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై' అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. మామయ్య వరుసయ్యే దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. అయితే అతని ఇల్లు మాత్రం రెండో మనిషికి అవకాశమే లేనంత చిన్నది. దీంతో డెయిరీ దుకాణంలో పనికి కుదిర్చి అక్కడే ఉండే ఏర్పాటు చేశాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో డైరీ వారు పనిలో నుంచి పంపించేశారు.దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌' క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక మూలన ఉండే టెంట్‌లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు.

టెంట్‌లోనే నివాసం..

టెంట్‌లోనే నివాసం..

కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్‌ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి నివాసమైపోయింది. స్థానికంగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్‌ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడితే 200-300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది.

పానీ పూరీ అమ్మాడు..

పానీ పూరీ అమ్మాడు..

ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగే సమయంలో యశస్వి పానీ పూరీలు కూడా అమ్మేవాడు! తనతో ఆడే కుర్రాళ్లను ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని వేడుకునే వాడు. టెంట్‌లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం వదులుకోలేదు.

జ్వాల కంట పడడంతో..

జ్వాల కంట పడడంతో..

యశస్వి గాథలు ఆజాద్‌ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్‌ జ్వాలా సింగ్‌ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది! అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్‌-19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్‌-19 జట్టులో చోటు కల్పించింది. విజయ్ హజరే డుబల్‌ సెంచరీ కోటీశ్వరుడినీ చేసింది. ఐపీఎల్‌ కనక వర్షం కురిపించింది. రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్‌ను రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.

సిగ్గు లేకుండా అడుక్కునే వాడిని..

సిగ్గు లేకుండా అడుక్కునే వాడిని..

ఆకలిని తట్టుకులేక అడక్కొని కడుపు నింపుకున్నానని ఈ యంగ్ సెన్సెషన్ ఓ ఇంటర్వ్యూలో తన ధీన స్థితిని చెప్పుకొచ్చాడు. ‘మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్‌ విరామం సమయంలో నా సహచరులు, వాళ్ల తల్లిదండ్రులు మంచి భోజనాలు తీసుకు వచ్చేవారు. నాకు బ్రేక్‌ ఫాస్ట్‌ అనేది ఉండేది కాదు. వాళ్లలోనే ఎవరో ఒకరిని బతిమాలి కడుపు నింపుకునేవాడిని. ఈ విషయంలో నేను ఏమాత్రం సిగ్గు పడకపోయేవాడిని.‘డబ్బులు లేవు కానీ ఆకలి మాత్రం ఉంది' అని ఏ మాత్రం సిగ్గు పడకుండా అడిగి తినే వాడిని. ఈ పరిస్థితిల్లో చాలా సార్లు నా తల్లి దండ్రులు గుర్తుకొచ్చి ఏడుస్తూ కుమిలిపోయేవాడిని.

మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

ఒత్తిడంటే తెలియదు.. తిండి గురించే బెంగ..

ఒత్తిడంటే తెలియదు.. తిండి గురించే బెంగ..

వేసవిలో ప్లాస్టిక్‌ టెంట్‌లో పడుకున్నప్పుడు వేడితో చచి్చపోయేవాడిని. దాంతో గ్రౌండ్‌లోనే పడుకునేందుకు సిద్ధమైపోయా. అయితే ఒక రాత్రి ఏదో పురుగు కుట్టి కన్ను వాచిపోయింది. దాంతో ఎంత వేడి ఉన్నా టెంట్‌లోనే పడుకునే వాడిని. క్రికెట్‌లో ఒత్తిడి అనే మాటే నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా రోజూ అనుభవించిన వాడిని కాబట్టి ఆటలో నాకు ఎలాంటి ఒత్తిడి అనిపించేది కాదు. బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన చెందినవాడిని.'యశస్వి జైస్వాల్‌ చెప్పుకొచ్చాడు.కుర్రాళ్ల టోర్నీలో మెరుపులు మెరిపిస్తున్న యశస్వీ.. ఐపీఎల్‌లో కూడా చెలరేగితే త్వరలోనే టీమిండియా తలుపు తట్టడం ఖాయం. ఆల్‌రౌండర్, లెప్టార్మ్ బ్యాట్స్‌మన్ కావడం అతనికి అదనపు బలం.

Story first published: Wednesday, February 5, 2020, 14:56 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X