న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు చేస్తున్న నిరసన దీక్ష నేపథ్యంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి 24 గంటల్లో రాజీనామా చేయాలని బ్రిజ్ భూషణ చరణ్ సింగ్‌ను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ వైదొలగాలని, జాతీయ సమాఖ్యను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలో బుధవారం నిరసన ప్రారంభించిన సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను బెదిరిస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో స్వయంగా క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూరే గురువారం రంగంలోకి దిగాడు. భజ్‌రంగ్ పునియా, రవి దహియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ వంటి అగ్రశ్రేణి అథ్లెట్లతో తన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఈ భేటి అనంతరమే డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బ్రిజ్ భూషణ్‌కు కేంద్ర మంత్రిత్వశాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. రెజ్లర్ల ఇతర డిమాండ్‌ల పట్ల కూడా అనురాగ్ ఠాకూర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తమ పోరాటం బ్రిజ్ భూషన్ రాజీనామా గురించే కాదన్న రెజ్లర్లు ఆయనను జైలుకు పంపిస్తామన్నారు. ఐదారుగురు అమ్మాయిలు బ్రిజ్ భూషణ్‌పై నేడు కేసులు నమోదు చేస్తారని వినేశ్ ఫొగాట్ తెలిపారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, తాము అబద్దాలు చెప్పడం లేదని స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా అన్నారు. మరోవైపు రెజ్లర్లు తమకు ఫిర్యాదు చేయవచ్చని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు తనను తీవ్ర కలతకు గురి చేస్తున్నాయని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. ''ఓ మహిళగా, మాజీ అథ్లెట్‌గా, ఇప్పుడు క్రీడా పాలకురాలిగా భారత రెజ్లింగ్‌లో జరుగుతోంది చూస్తుంటే ఆందోళనగా, కలతగా ఉంది. ముఖ్యంగా ఆ సమాఖ్యలోని ఓ సీనియర్ ప్రతినిధిపై ఓ వర్గం రెజ్లర్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్ల నిరసనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేగంగా స్పందించి 72 గంటల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐ స్పందించాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం సరైన దిశలో సరైన నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అథ్లెట్ల హక్కులను కాలరాయకూడదని ఐఓఏ అధ్యక్షురాలిగా భావిస్తున్నా. నిజానిజాలను బయట పెట్టాలని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలను కోరుతున్నా. మహిళా అథ్లెట్ల భద్రత కోసం ఐఓఏ అన్ని చర్యలూ తీసుకుంటుంది'' అని ఆమె పేర్కొంది.