న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు... త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని చెప్పాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ బ్యాట్ పట్టుకుంటానన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. తన వన్డే కెరీర్‌లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. దానికి భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు.
'ఆ దేవుడే నీ రాతను నిర్దేశిస్తాడు. పబ్లిక్ డిమాండ్ మేరకు ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెడుతా. ఇంతకు మించిన గొప్ప అనుభూతి ఇంకోటి ఉండదు! మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని! మీ మద్దతు ఇలాగే కొనసాగాలి. నిజమైన అభిమాని... కఠిన సమయాల్లో మద్దతుగా నిలుస్తాడు''అని యువీ పేర్కొన్నాడు.
యువరాజ్ నిర్ణయంపై అతని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువీ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం, మళ్లీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొడితే చూడాలని ఉందన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువీ.. తన కెరీర్ చివరి దశలో రాణించలేకపోయాడు. దాంతో 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అయితే ఫిబ్రవరిలో మాజీ క్రికెటర్లతో నిర్వహించే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ కోసమే యువీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందే యువీ ఈ టోర్నీ ఆడాడు. అయినా మళ్లీ ఈ పోస్ట్ ఎందుకు చేస్తాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో పంజాబ్ తరఫున ఆడుతాడేమోనని అనుకుంటున్నారు.