ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన ఆటను సరికొత్తగా తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాడు. గత సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రిషబ్ పంత్.. ఈ సారి ఎలాగైనా అద్భుతమైన రీఎంట్రీ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగా భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వైట్-బాల్ ప్లేయర్లలో ఒకడైన యువరాజ్ సింగ్‌ను మెంటార్‌గా ఎంచుకుని.. ముంబై వేదికగా కఠినమైన శిక్షణను పూర్తి చేశారు.
డే అండ్ నైట్ ప్రాక్టీస్ సెషన్స్
ముంబైలోని చారిత్రాత్మక బ్రబౌర్న్ స్టేడియంలో దాదాపు 4 రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణా శిబిరం జరిగింది. ఈ సెషన్లలో రిషబ్ పంత్ కేవలం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా యువీ నుంచి విలువైన సలహాలను స్వీకరించారు. ముఖ్యంగా వైట్-బాల్ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌ను మెరుగుపరుచుకోవడంపై రిషబ్ పంత్ దృష్టి పెట్టాడు. ఫీల్డింగ్ పరిమితులను అనుకూలంగా మార్చుకుంటూ కొత్త రకమైన షాట్లను ప్రయోగించడం.. ఒత్తిడి సమయంలో వికెట్ కాపాడుకుంటూనే పరుగులు రాబట్టడం వంటి అంశాలపై యువరాజ్ సింగ్ శిక్షణ ఇచ్చాడు. మ్యాచ్ పరిస్థితులను ప్రతిబింబించేలా డే అండ్ నైట్ ఈ ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించడం విశేషం.

యువీ ట్రాక్ రికార్డు
యువరాజ్ సింగ్‌కు యు ప్లేయర్లను అద్భుతమైన ఫామ్‌లోకి తీసుకురావడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి యువ కెరటాలు యువీ గైడెన్స్‌లోనే ప్రపంచ స్థాయి బ్యాటర్లుగా ఎదిగారు. అదే విధంగా గతంలో సంజూ శాంసన్ కూడా యువరాజ్ వద్ద శిక్షణ పొందాడు. ఇప్పుడు రిషబ్ పంత్ కూడా అదే బాటలో పయనిస్తూ.. తనలో ఉన్న పాత దూకుడును తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆగస్టు 2024 తర్వాత రిషబ్ పంత్ భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా కనిపించలేదు.. కాబట్టి ఈ ఐపీఎల్ సీజన్ అతని కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది.
చెన్నైకి రిషబ్ పంత్
ముంబైలో తన వ్యక్తిగత శిక్షణ ముగించుకున్న వెంటనే రిషబ్ పంత్ నేరుగా చెన్నైకి చేరుకున్నాడు. అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్వహిస్తున్న ప్రీ-సీజన్ క్యాంపులో రిషబ్ పంత్ చేరాడు. ఈ క్యాంపు సీనియర్ కోచ్‌లు భరత్ అరుణ్, లాన్స్ క్లూజనర్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇక్కడ రిషబ్ పంత్ తన జట్టు సభ్యులైన ఆయుష్ బదోని, మయాంక్ యాదవ్ వంటి వారితో కలిసి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఈ క్యాంపు లక్నోకు తరలి వెళ్లనుంది. ఏప్రిల్ 1న తన పాత జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనే లక్నో తన తొలి మ్యాచ్ ఆడనుండటం విశేషం.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా తమ ఐపీఎల్ సన్నాహాలను ముమ్మరం చేసింది. మార్చి 17 నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో హెడ్ కోచ్ కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు ఆ జట్టు ప్రకటించింది. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ వంటి కీలక ప్లేయర్లు ఇప్పటికే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి పోరాటాన్ని మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేయనుంది. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ స్టార్ ఆటగాళ్ల మధ్య గట్టి పోటీని తలపించేలా కనిపిస్తోంది.