ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) చిక్కుల్లో పడింది. సీఎస్‌కేపై సన్‌టీవీ రూ. కోటి దావా వేసింది. జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్, డైలాగులు వాడుకొని కాపీరైట్ ఉల్లంఘించిందని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కాగా వాటిని తొలగించామని సీఎస్‌కే చెప్పగా మరోసారి ఇరువర్గాల వాదన విని నిర్ణయం తీసుకుంటామని మద్రాస్ హైకోర్టు తెలిపింది.
సీఎస్‌కే తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోషనల్ వీడియోల కోసం జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని పాపులర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్‌లు, డైలాగులను వాడుకుంది. ఈ సినిమాలను నిర్మించింది తామని, వాటికి సంబంధించిన హక్కులు తమకే ఉన్నాయని, తమ అనుమతి లేకుండా వీటిని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటం చట్టవిరుద్ధమని సన్ టీవీ పేర్కొంది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1 కోటీ నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీ డిమాండ్ చేసింది.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు.. తక్షణమే సదరు కాపీరైట్ కంటెంట్ ఉన్న వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించగా.. తొలగించామని సీఎస్‌కే యాజమాన్యం బదులిచ్చింది. మరోసారి ఇరు పక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకుంటామని తీర్పును వాయిదా వేసింది.
సాధారణంగా ఐపీఎల్ జట్లు తమ అభిమానులను అలరించడానికి సినిమా పాటలను, డైలాగులను వాడుతుంటాయి. అయితే సన్ టీవీకి సొంతంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. ఈ రెండు జట్ల మధ్య మైదానంలోనే కాకుండా.. ఇప్పుడు కోర్టులోనూ చట్టపరమైన పోరాటం మొదలవ్వడం విశేషం. హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను తీసుకొవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా సీఎస్‌కేపై దావా వేయడంతో ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ సన్‌రైజర్స్‌పై మండిపడుతున్నారు.